సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ అదుపులోకి వచ్చేవరకు బిహార్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది.అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటివరకూ నోటిఫికేషన్ జారీ చేయనందున ఈ దశలో స్పందించడం తొందరపాటు అవుతుందని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్‌ఎస్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. క్షేత్రస్ధాయిలో కోవిడ్-19 పరిస్థితి తీవ్రంగా ఉందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
అసాధారణ పరిస్ధితుల్లో ఎన్నికలను వాయిదా వేయవచ్చని ప్రజా ప్రాతినిథ్యం చట్టంలో పొందుపరిచిన క్రమంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను ఆదేశించాలని పిటిషనర్ అవినాష్ ఠాకూర్ కోరారు. ఎన్నికలు నిర్వహించరాదని తాము ఎన్నికల సంఘాన్ని ఎలా కోరతామని, ఎన్నికల వాయిదాకు కోవిడ్-19 సరైన ప్రాతిపదిక కాదని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. కోవిడ్-19 పరిస్థితిని అంచనా వేసి ఎన్నికల సంఘం ఓ నిర్ణయం తీసుకోవాలని, ఎన్నికలు నిర్వహించరాదని కోర్టు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించజాలదని పేర్కొంటూ పిటిషన్‌ను తిరస్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment