ఫలితాలకు ముందే.. తుది విచారణ ముగించాలి | Supreme Court refuses to stay Group 1 Mains Exam: Telangana | Sakshi
Sakshi News home page

ఫలితాలకు ముందే.. తుది విచారణ ముగించాలి

Published Tue, Oct 22 2024 12:45 AM | Last Updated on Tue, Oct 22 2024 12:45 AM

Supreme Court refuses to stay Group 1 Mains Exam: Telangana

గ్రూప్‌–1పై రాష్ట్ర హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచన

పరీక్షలు జరుగుతున్న సమయంలో జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం

ఇప్పుడు వాయిదా అనేది అసాధారణ విషయమని స్పష్టీకరణ

తుది తీర్పునకు లోబడే నియామకాలు జరపాలన్న హైకోర్టు ఉత్తర్వుల ప్రస్తావన

స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ పిటిషన్‌ను తిరస్కరించిన సర్వోన్నత న్యాయస్థానం

సాక్షి, న్యూఢిల్లీ:  ‘‘ఇప్పటికే గ్రూప్‌–1 అభ్యర్థులు పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లిపోయారు, మరికొందరు వెళ్తున్నారు. ఈ సమయంలో మేం స్టే ఎలా ఇస్తాం? స్టే ఇవ్వడం వలన గందరగోళానికి గురిచేసినట్టే అవుతుంది. ఈ సమయంలో మేం జోక్యం చేసుకోలేం’’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పుడు వాయిదా అనేది అసాధారణ విషయమని పేర్కొంది. అయితే గ్రూప్‌–1 పరీక్షలకు సంబంధించి ఫలితాలు వెలువడకముందే తుది విచారణ ముగించాలని రాష్ట్ర హైకోర్టుకు సూచించింది. గ్రూప్‌–1ను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించింది.

గ్రూప్‌–1 పరీక్షలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీవో 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని.. పరీక్షలను వాయిదా వేసేలా ఆదేశించాలని కోరుతూ రాంబాబు అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ను అందరికీ వర్తింపజేయాలని, ఓపెన్‌ కేటగిరీలో మెరిట్‌తో అర్హత సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులను రిజర్వేషన్‌ కేటగిరీగా పరిగణించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని అందులో పేర్కొన్నారు. దీనిపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్థీవాలా, మనోజ్‌ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.

ఇప్పుడు ఎలా స్టే ఇస్తాం?
‘‘వేలాది మంది విద్యార్థులు పరీక్షా కేంద్రాల్లో ఉన్నారు. ఈ సమయంలో పరీక్షలపై ఎలా స్టే ఇస్తాం’’ అని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో 29 తీసుకువచ్చిందని కపిల్‌ సిబల్‌ సమాధానమిచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ఇన్నేళ్లకు తొలిసారి గ్రూప్‌–1 పరీక్షలు జరుగుతున్నాయని.. మళ్లీ ఇప్పట్లో గ్రూప్‌–1 నిర్వహించడం, పోస్టులు భర్తీ చేయడం జరగదని ధర్మాసనానికి వివరించారు. అభ్యర్థులు ఈసారి అవకాశం కోల్పోతే, జీవితంలో మరో చాన్స్‌ ఉండదని.. అందువల్ల జీవో 29పై స్పష్టత వచ్చే వరకు పరీక్షలు నిర్వహించవద్దని కోరుతున్నామని తెలిపారు.

వాయిదా అనేది అసాధారణ విషయం
ఈ సమయంలో చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌ జోక్యం చేసుకుంటూ.. ‘‘గ్రూప్‌–1 పరీక్షలను వాయిదా వేయాలని టీజీపీఎస్సీని ఎలా ఆదేశిస్తాం. అది చాలా అసాధారణ విషయం కదా’’ అని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కపిల్‌ సిబల్‌.. ఇది వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీ వర్సెస్‌ భూపేంద్ర యాదవ్‌ కేసులోని సుప్రీం తీర్పు వివరాలను ధర్మాసనం ముందుంచారు. దీంతో.. ‘‘మీరు చెబుతున్నవన్నీ ఓకే.. కానీ పరీక్షలు వాయిదా వేయండి అని పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ఎలా ఆపగలం’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే వాయిదా వేయకుంటే వేల మంది అభ్యర్థులు నష్టపోతారని సిబల్‌ విన్నవించారు.

ఫలితాలకు ముందే హైకోర్టు విచారణ ముగించేలా
గ్రూప్‌–1 కేసులో హైకోర్టులో టీజీపీఎస్సీ కౌంటర్‌ దాఖలు చేసిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి సుప్రీం ధర్మాసనానికి తెలిపారు. అలాగే ప్రభుత్వం తమ వాదనలను కౌంటర్‌ రూపంలో అందజేయనుందని వివరించారు. హైకోర్టు విచారణ సందర్భంగా పరీక్షలు పూర్తవడానికి ఎంత సమయం పడుతుందని ప్రశ్నించిందని.. మూడు నెలల సమయం కావాలని టీజీపీఎస్సీ సమాధానం ఇచ్చిందని వెల్లడించారు. ఈ సమయంలో కపిల్‌ సిబల్‌ జోక్యం చేసుకుంటూ.. ‘‘ఫలితాలు వెలువడటానికి మూడు నెలలే సమయం ఉన్న కారణంగా ఈ కేసును ఈరోజే విచారించాలి.

కేసుపై స్పష్టత రావాలి’’ అని కోరారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. ప్రస్తుతం తాము ఏ తీర్పు ఇచ్చినా పరీక్షల ప్రక్రియలో చాలా ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయని.. అందువల్ల మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ‘‘తమ తుది తీర్పునకు లోబడే నియామకాలు జరపాలని’’ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేసింది. అయితే పరీక్షల ఫలితాల విడుదలకు ముందే ఈ కేసులో తుది విచారణ ముగించాలని హైకోర్టుకు సూచించింది. పరీక్షలు వాయిదా వేయాలన్న పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్టు పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement