ఢిల్లీ : మద్యం పాలసీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్ మంగళవారం (ఆగస్ట్20న) సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. జస్టీస్ బీఆర్ గవాయి, జస్టీస్ విశ్వనాథ్ ధర్మాసనం బెయిల్ పిటిషన్‌పై విచారించనుంది.
ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిలు ఇవ్వాలని కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. జూలై 1న న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దాన్ని సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 12న పిటిషన్‌పై విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా కవిత తరుఫు న్యాయవాది ముకుల్ రోహత్గి మధ్యంతర బెయిల్ కోరారు. ‘అయిదు నెలల నుంచి కవిత జైల్లో ఉన్నారు. ఇప్పటికే చార్జిషీట్లు దాఖలు చేశారు. ఈ కేసులో 493 మంది సాక్షులు ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే మనీశ్ సిసోడియా, కేజ్రీవాల్‌కు బెయిల్ ఇచ్చారు. కవిత ఒక మహిళ.. మధ్యంతర బెయిల్ ఇవ్వండి’ అని కోరారు.
కవిత తరపున వాదనలు విన్న అనంతరం.. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని తెలిపింది. ప్రతివాదులుగా ఉన్న దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్ట్ 20కి వాయిదా వేసింది. దీంతో రేపు కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment