న్యూఢిల్లీ: 18వ లోక్‌సభ స్పీకర్‌గా ఎవరుంటారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్డీఏలోని మిత్రపక్షాలతో బీజేపీ సంప్రదింపులు మొదలుపెట్టింది. ఈ నెల 26న జరిగే స్పీకర్ ఎన్నికకు మంగళవారం నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. 293 మంది ఎంపీలతో ఎన్డీఏ సంకీర్ణానికి స్పష్టమైన మెజారిటీ ఉంది. ఎన్డీఏ తమ స్పీకర్ అభ్యర్థి ఎవరనే దానిపై ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు.
పలు ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. అయితే విపక్ష ఇండియా కూటమికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది. మరోవైపు ఇండియా కూటమి స్పీకర్ పదవికి పోటీపడే అంశాన్ని చురుకుగా పరిశీలిస్తోందని విశ్వసనీవర్గాలు తెలిపాయి. స్పీకర్‌పై ఎలాంటి తుది నిర్ణయాన్ని తమకు తెలుపలేదని, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో సహా కూటమి నేతలందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారని కేంద్రమంత్రి కె.రామ్మోహన్ నాయుడు తెలిపారు.
బీజేపీ నాయకత్వం తనతో సంప్రదింపులు జరిపిందని ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నాయకుడొకరు తెలిపారు. వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. బీజేపీ తమ అగ్రనేతలందరికీ మునుపటి శాఖలే కేటాయించి.. కొనసాగింపును భూమికగా ఎంచుకున్నందున 17వ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కొనసాగించొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
ఎన్డీఏ వైఖరిని బట్టి స్పీకర్ పోస్టుకు తమ అభ్యరి్థని పోటీకి నిలుపడంపై నిర్ణయం తీసుకుంటామని ఇండియా కూటమి నేతలు చెబుతున్నారు. డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించడం సంప్రదాయంగా వస్తోందని, బీజేపీకి అందుకు ముందుకు రాకపోతే పోటీచేయక తప్పదని ఇండియా కూటమి నేతలు అంటున్నారు.
కొత్త స్పీకర్‌పై ఏకాభిప్రాయాన్ని నిర్మించడానికి విపక్షాలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుందని, అలా జరపని పక్షంలో తాము స్పీకర్ పదవికి పోటీ పెడతామని ఇండియా కూటమి భాగస్వామ్య పక్షమైన రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఎంపీ ఎన్‌కే ప్రేమచంద్రన్ సోమవారం విలేకరులతో అన్నారు. ఎన్డీఏ అభ్యర్థి ఎవరనేది మాకు తెలిపిన తర్వాత పోటీపై నిర్ణయం తీసుకుంటామని ఇండియా కూటమికి చెందిన నాయకుడొకరు అన్నారు. బలహీనవర్గాలకు చెందిన అభ్యరి్థని పోటీపెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియా కూటమికి 234 మంది ఎంపీల బలముంది.
Comments
Please login to add a commentAdd a comment