సాక్షి, చెన్నై: ప్రైవేటు విద్యా సంస్థల బస్సులు, ప్రైవేటు ఆపరేటర్ల వాహనాల్లో సీసీ కెమెరాలను ప్రభుత్వం తప్పని సరి చేసింది. అలాగే, నలువైపులా సెన్సార్ పరికరాల్ని అమర్చాలన్న ఉత్తర్వులు బుధవారం జారీ అయ్యాయి. గతంలో ఓ ప్రైవేటు విద్యా సంస్థ బస్సులో ఉన్న రంధ్రం నుంచి కింద పడి ఓ విద్యార్థిని మరణించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈ ఘటన అప్పట్లో జనంలో ఆగ్రహావేశాల్ని రగల్చడంతో కోర్టు జోక్యం చేసుకుంది.
దీంతో విద్యాసంస్థల బస్సులు, విద్యార్థులను తరలించే ప్రైవేటు ఆపరేటర్ల వాహనాలకు సంబంధించిన నిబంధనలు కఠినం చేశారు. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందుగా బస్సులను ఆర్టీఓ అధికారులు తనిఖీలు చేసి, సర్టిఫికెట్లను మంజూరు చేస్తూ వస్తున్నారు. అయినా, ఏదో ఒక చోట విద్యా సంస్థల బస్సులు, ఇతర ప్రైవేటు ఆపరేటర్ల వాహనాల కారణంగా విద్యార్థులకు ప్రమాదాలు తప్పడం లేదు. దీంతో మోటారు వెహికల్ చట్టంలో సవరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఉత్తర్వుల జారీ..
రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి ఫనీంద్రరెడ్డి బుధవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు లగ్జరీ కార్లు వంటి వాహనాల్లో ఉండే విధంగా విద్యాసంస్థల బస్సులు, వాహనాల్లో ముందు, వెనుక భాగాల్లో సీసీ కెమెరాలను తప్పనిసరి చేశారు. అలాగే, వాహనాలకు నలువైపులా సెన్సార్ పరికరం అమర్చేందుకు ఆదేశాలు ఇచ్చారు. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా బస్సు ముందు, వెనుక భాగంలో ఎవరైనా ఉన్నారా..? అని డ్రైవర్ తెలుసుకునేందుకు వీలుందని వివరించారు. అలాగే, సెన్సార్ పరికరం నుంచి వచ్చే సంకేతాల మేరకు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించేందుకు వీలుందని పేర్కొన్నారు. తక్షణం ఆయా బస్సులు, వాహనాల్లో వీటిని అమర్చేందుకు చర్యలు తీసుకోవాలని, తనిఖీలు చేయాలని ఆర్టీఓ అధికారులను, పోలీసు యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment