
కరూర్(తమిళనాడు): కోలీవుడ్ ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధినేత విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 38 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. 50 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కరూర్ ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు. తొక్కిసలాట ఘటనతో విజయ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.



విజయ్ సభలో తీవ్ర తోపులాట చోటుచేసుకోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. కరూర్‌లో నిర్వహించిన విజయ్ ప్రచార సభకు భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. దీంతో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో తోపులాట చోటుచేసుకుంది. ప్రమాదాన్ని గమనించిన విజయ్ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు.

10 వేల మందితో ర్యాలీకి విజయ్ అనుమతి తీసుకున్నారు. ర్యాలీకి ఊహించని రీతిలో జనం తరలి వచ్చారు. ఒక్కసారిగా జనం ఎగబడటంతో తోపులాట జరిగింది. పరిమితికి మించి జనం రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. గతంలో మధురై తొలి సభలోనూ తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. తొక్కిసలాట ఘటనపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయ చర్యలకు సీఎం స్టాలిన్ ఆదేశించారు. ఘటనపై కరూర్ కలెక్టర్‌తో సీఎం స్టాలిన్ మాట్లాడారు. రేపు బాధిత కుటుంబాలను స్టాలిన్ పరామర్శించనున్నారు

కాగా, మీట్ ది పీపుల్ నినాదంతో విజయ్ చేపట్టిన ప్రచార యాత్ర గురించి తెలిసిందే. ప్రతి శనివారం ఆయన రెండు జిల్లాలను ఎంపిక చేసుకుని పర్యటిస్తున్నారు. ఇవాళ (శనివారం, సెప్టెంబర్ 27) నామక్కల్, కరూర్‌లలో పర్యటించేందుకు నిర్ణయించారు. అయితే, విజయ్ ప్రచార సభకు స్థల ఎంపిక, అనుమతి వ్యవహారం వివాదానికి దారి తీసింది. పోలీసులు సూచించిన ప్రదేశాన్ని విజయ్ వర్గీయులు, ఆయన వర్గీయులు ఎంపిక చేసిన ప్రదేశాన్ని పోలీసులు నిరాకరిస్తూ వచ్చారు. దీంతో పర్యటన సాగేనా? అన్న చర్చ జరిగింది. ఎట్టకేలకు పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పర్యటన ఖరారైంది. కరూర్‌లో వేలుస్వామి పురంలో ప్రచార బహిరంగ సభకు అనుమతి ఇచ్చారు.
విజయ్ సభలో తొక్కిసలాటపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి: కోలీవుడ్ ప్రముఖ నటుడు, టీవీకే అధినేత విజయ్ ప్రచార సభలో శనివారం కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో భారీ ప్రాణనష్టం వాటిల్లడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ విషాదకర సంఘటనలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. ఊహించలేని దుఃఖంలో మునిగిపోయిన వారి కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు. ఈ విషాద సమయంలో వారికి అండగా ఉంటామని ఆయన అన్నారు.