
సాక్షి, చెన్నై: డిసెంబర్ నెల జీతం పొందడానికి కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తప్పనిసరిగా తీసుకోవాలంటూ తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ మూడు రోజుల కింద సర్క్యులర్ జారీ చేసింది. అయితే దీనిపై ఉద్యోగులు ఆగ్రహం వ్యకం చేయడంతో సర్క్యులర్‌ను ఉపసంహరించుకుంది. టీకాలు వేసుకునే నిర్ణయాన్ని వ్యక్తి విచక్షణకు వదిలివేయాలని, ఎవరినీ బలవంతం చేయకూడదని మద్రాస్ హైకోర్టు పేర్కొంది.
కాగా సోమవారం, తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ (మధురై) ఉమాదేవి.. ఉద్యోగులందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, లేని పక్షంలో వారి డిసెంబర్ జీతం నిలివేయాలని సర్క్యులర్‌లో ఆదేశించారు. నవంబర్ 26న చైర్మన్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సర్య్కులర్‌లో పేర్కొన్నారు. వైద్య కారణాల వల్ల ఎవరైనా ఉద్యోగి వ్యాక్సిన్ తీసుకోలేకపోతే, దానిని నిర్ధారిస్తూ వైద్య ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
చదవండి: (Omicron: భారత్‌లో ఒమిక్రాన్ బయటపడింది ఇలా..!)
దీనిపై తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డ్ ట్రేడ్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ జనరల్ సెక్రటరీ ఆర్ ముత్తులింగం మాట్లాడుతూ, 'వ్యాక్సిన్ తీసుకున్న చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వ్యాక్సిన్ కరోనా వ్యాప్తిని అడ్డుకుంటుందని ఎటువంటి ఆధారం లేదు. కార్మిక చట్టాలను ఉల్లంఘించినపుడు లేదా ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు ప్రారంభించినప్పుడు మాత్రమే జీతాన్ని నిలిపివేసే అవకాశం ఉంద'ని అన్నారు.
తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఎండీ రాజేష్ లఖానీ మాట్లాడుతూ.. 'ఉద్యోగులు ప్రజలతో మమేకమవుతున్నందున టీకాలు వేయించుకోమని మాత్రమే అధికారులను కోరినట్లు చెప్పారు. 'చీఫ్ ఇంజనీర్ ఉమాదేవి అత్యుత్సాహంతో ఆ సర్క్యులర్ జారీ చేశారు. జీతాలను నిలిపివేయడం సమావేశంలో తీసుకున్న నిర్ణయం కాదు. ఇప్పుడు, ఆ సర్క్యులర్ రద్దు చేశాము. కేవలం రెండు డోసులను తీసుకోవాలని ఉద్యోగులను అభ్యర్థిస్తూ కొత్త సర్క్యులర్ జారీ చేయబడింది' అని రాజేష్ లఖానీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment