
జైపూర్ : రాజస్తాన్ హైడ్రామా రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు గవర్నర్ పంపిన మార్గదర్శకాలపై చర్చించేందుకు రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లాత్ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి గవర్నర్ లేవనెత్తిన అంశాలపై తాము సవివరంగా చర్చించి సమాధానాలను సిద్ధం చేశామని భేటీ అనంతరం మంత్రి హరీష్ చౌధరి పేర్కొన్నారు.జులై 31నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని తాము కోరుతున్నామని, అసెంబ్లీని సమావేశపరచడం తమ హక్కని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ఎలా నిర్వహిస్తారనేది స్పీకర్ నిర్ణయమని చెప్పారు. కేబినెట్ ప్రతిపాదనలను గవర్నర్ ముందుంచుతామని చెప్పారు.
21 రోజుల నోటీస్‌తో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకోవచ్చని గవర్నర్ తెలిపిన క్రమంలో ఈ పరిణామం బీజేపీ బేరసారాలకు దిగేందుకు అనుకూలంగా ఉందని కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి విశ్వాస పరీక్షకు సిద్ధపడితే 21 రోజుల నోటీస్ అవసరం లేదని గవర్పర్ పేర్కొన్న క్రమంలో ఈ దిశగా కేబినెట్ భేటీలో ఎలాంటి చర్చ జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో తక్కువ వ్యవధిలో ఎమ్మెల్యేలను సమావేశాలకు రప్పించలేరని గవర్నర్ పేర్కొంటూ ఎమ్మెల్యేలకు 21 రోజుల నోటీస్‌ను అందిస్తారా అని గవర్నర్ అశోక్ గహ్లాత్ ప్రభుత్వాన్ని వివరణ కోరిన సంగతి తెలిసిందే. మరోవైపు సభలో భౌతికదూరం నిబంధనలను ఎలా పాటిస్తారని ఆయన ప్రభుత్వాన్ని వివరణ కోరారు. మరోవైపు తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో విలీనం చేయడంపై ఆ పార్టీ అధినేత్రి మాయావతి విరుచుకుపడ్డారు. ఓ వైపు ఈ వ్యవహారంలో న్యాయపోరాటం జరుగుతుండగా కాంగ్రెస్ పార్టీకి, అశోక్ గహ్లాత్‌కు గుణపాఠం చెబుతామని ఆమె హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment