చత్తీస్‌గఢ్: సాధారణంగానే మైనర్ల వివాహం చట్ట విరుద్ధం, పైగా చెల్లదు కూడా. అలాంటిది ఓ మైనర్ బాలిక వివాహం చేసుకోవడమే గాక రక్షణ కావాలంటూ పంజాబ్, హర్యానా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వివరాల్లోకి వెళితే.. 16 ఏళ్ల బాలిక తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నందున ఆమెకు వారి నుంచి ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. బాలిక ఇంకా మైనర్ కాగా తనకు ఇది రెండో వివాహమని పిటిషన్‌లో పేర్కోవడం గమనార్హం. అయితే బాలిక పిటిషన్ను స్వీకరించిన పంజాబ్, హర్యానా ఉమ్మడి హైకోర్టు విచారణ చేపట్టింది.
విచారణలో జస్టిస్ సుధీర్ మిట్టల్ ధర్మాసనం ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ‘మైనార్టీ తీరకుండానే పెళ్లి చేసుకోవడం చట్ట విరుద్ధం. కాగా బాల్యవివాహాల నిషేధ చట్టం, 2006 లోని సెక్షన్ 12 కింద ఈ వివాహం చెల్లదు. ఇదీ గాక సదరు బాలిక తనకిది రెండో వివాహం అని పిటిషన్‌లో పేర్కొనడంపై విచారణ జరపాలని తెలుపుతూ తదుపరి విచారణ జూలై 23కు వాయిదా వేసింది. అప్పటి వరకు ఆ బాలికకు, వివాహం చేసుకున్న యువకుడికి ప్రభుత్వం రక్షణ కల్పించాలంటూ స్పష్టం చేసింది. బాలిక నివాసానికి సమీపంలోని నారి నికేతన్‌లో ఉంచి భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అదే క్రమంలో ప్రభుత్వం పిటిషనర్ల జీవితానికి, స్వేచ్ఛకు ఎటువంటి హాని జరగకుండా చూసుకోవాలి. ఇరువురి తల్లిదండ్రులు, బంధువులను పిలిపించి వారి సమక్షంలోనే సదరు బాలికకు కౌన్సెలింగ్ ఇప్పించాలి. కౌన్సెలింగ్ తర్వాత ఆమె తీసుకున్న నిర్ణయాన్ని నివేదిక రూపంలో జూలై 23 లేదా అంతకంటే ముందే హైకోర్టుకు అందజేయాలి' అని ధర్మాసనం తీర్పునిచ్చింది. మైనార్టీ తీరకుండానే రెండు సార్లు వివాహం చేసుకున్న సదరు బాలిక పిటిషన్పై హైకోర్టు తుది తీర్పుపై ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment