లక్నో: వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో సర్వే వ్యవహారం న్యాయస్థానాలకు చేరిన వేళ.. యూపీలోని ఇత్తెహాద్ మిల్లత్ కౌన్సిల్ చీఫ్ తాఖీర్ రజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దేశంలోని ఆలయాలను కూల్చి వేసి మసీదులను కట్టలేదని.. పెద్ద సంఖ్యలో జనం ఇస్లాంలోకి మారి ఆలయాలను మసీదులుగా మార్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే..
అలాంటి మసీదులను ప్రభుత్వాలు ముట్టుకోరాదని హెచ్చరించారు. జ్ఞానవాపి మసీదులో శివలింగం దొరికిందన్న ప్రచారం.. హిందూయిజాన్ని అపహాస్యం చేయడమే!. దేశంలోని చాలా మసీదులు కట్టడానికి ముందు.. అక్కడ ఆలయాలే ఉండేవని పేర్కొన్నారు. అయితే, ఆ ఆలయాలను కూల్చలేదని చెప్పారు. వాటిని కేవలం మసీదులుగా మార్చారన్నారు. వాటిని ముట్టుకోవద్దని, కాదని ప్రభుత్వం బలవంతపు చర్యలకు పూనుకుంటే మాత్రం ముస్లింలు వ్యతిరేకిస్తారని స్పష్టం చేశాడు.
ముస్లింలు ఎవరూ న్యాయ పోరాటానికి సిద్ధమవ్వాల్సిన అవసరం లేదని, బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఎలాంటి తీర్పు వచ్చిందో తెలిసిందేనని అన్నారు. జ్ఞానవాపి మసీదుపై ఇప్పుడు ఏ కోర్టుల్లోనూ అప్పీలు చేయబోమన్నాడు. విద్వేషవాదులు.. తలచుకుంటే దేశంలో ఏదైనా జరుగుతుందన్నాడు. దేశంలో శాంతి సామరస్యాలను కాపాడేందుకు ముస్లింలు శాంతంగా ఉంటున్నారన్నాడు. తాఖీర్ రజా వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో దుమారం చెలరేగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment