
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం(జనవరి 30) ఉదయం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు భద్రతా సిబ్బంది మృతి చెందారని, మరో 14 మంది గాయపడ్టట్లు బస్తర్ జిల్లా పోలీసులు తెలిపారు. గాయపడ్డ జవాన్లను హెలికాప్టర్‌లో రాయ్‌పూర్‌కు చికిత్స నిమిత్తం తరలిస్తున్నట్లు చెప్పారు. మృతి చెందిన వారిని కోబ్రా కానిస్టేబుళ్లు సి. దేవన్, పవన్ కుమార్, సీఆర్పీఎఫ్ జవాను లాంధర్ సిన్హాగా గుర్తించారు.
సుఖ్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దులోని టేకులగూడెం గ్రామంలో మావోయిస్టుల కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు సోమవారమే పారామిలిటరీ సిబ్బందితో బేస్ క్యాంపుకు ఏర్పాటు చేశారు. టేకులగూడెం సమీపంలోని జోనగూడ, అలిగూడ గ్రామాల మధ్య కోబ్రా, సీఆర్పీఎఫ్ బలగాలు మంగళవారం ఉదయం కూంబింగ్‌కు వెళ్లాయి. ఈ సమయంలో వారికి మావోయిస్టులు ఎదురుపడ్డారు. వెంటనే మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. ఉదయం ప్రారంభమైన ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
మూడేళ్ల క్రితం 2021లో టేకులగూడెం అడవుల్లోనే మావోయిస్టులు, భద్రతాబలగాలకు భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో అప్పట్లో 21 మంది జవాన్లు మృతి చెందారు. మళ్లీ తిరిగి ఇప్పుడు అదే ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు భద్రతా సిబ్బంది మరణించడంతో పాటు భారీ సంఖ్యలో జవాన్లు గాయపడటం పోలీసులను కలవరపెడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment