
చెన్నై: తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. మణికందంలో ఒక కోత మిల్లులో దొంగతనం చేశాడనే ఆరోపణలపై చక్రవర్తి అనే వ్యక్తిని చెట్టుకు కట్టి చచ్చేదాకా కొట్టారు. మర్మాంగాల మీద బలంగా తన్నడంతో అతని ఊపిరి ఆగిపోయినట్లు తెలుస్తోంది. దీంతో మిల్లు యజమాని, ఇద్దరు కార్మికులపై పోలీసులు హత్య కేసు నమోదుచేశారు.
త్రిచీ-మధురై హైవేలో మణికందం వద్ద ఆశాపుర రంపపు మిల్లు ఉంది. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వాళ్లు ఇక్కడ కూలీలుగా పని చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన కలపతో.. ఇంటి ఫర్నీచర్ తయారు చేస్తుంటారు వాళ్లు. ఈ క్రమంలో.. శనివారం ఓ వ్యక్తి దొంగతనంగా మిల్లులోకి చొరబడినట్లు అసోంకు చెందిన ముగ్గురు కూలీలు చెప్పారు. దీంతో.. తువకుడికి చెందిన చక్రవర్తి అనే వ్యక్తిని బంధించి చెట్టుకు కట్టేసి చితకబాదారు.
ఈ దాడిలో అతను అక్కడికక్కడే కన్నుమూశాడు. మెడ, ఛాతీ, కుడి మోచేయి.. భుజం, మర్మాంగాలపై తీవ్రగాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు. మర్మాంగాలపై బలంగా తన్నడంతోనే అతని ఊపిరి ఆగిపోయినట్లు తెలిపారు. దొంగతనం జరిగిందనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేలోపే.. చెట్టుకు కట్టేసి ప్రాణం లేని చక్రవర్తి కనిపించాడు. ఈ ఘటనకు సంబంధించి.. అసోంకు చెందిన ఫైజల్ షేక్, ముజ్ఫల్ హుక్‌తో పాటు మిల్లు ఓనర్ ధీరేంద్రపై హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
Comments
Please login to add a commentAdd a comment