ప్రతీకాత్మక చిత్రం
సాక్షి ప్రతినిధి, చెన్నై : పొరుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులతో తమిళనాడుకు ముప్పు పొంచి ఉందని, జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణన్ జిల్లా కలెక్టర్లను హెచ్చరించారు. రాష్ట్రంలో కరోనా కేసులను నియంత్రించడానికి రాబోయే పదిరోజులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెన్నై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ (డీఎంఎస్) ప్రాంగణంలోని మందుల గిడ్డంగిని ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య అధికంగా ఉందని చెప్పారు. ఈ ప్రభావం తమిళనాడుపై పడే ప్రమాదం ఉన్నందున అన్ని జిల్లాల కలెక్టర్లు జాగ్రత్తగా ఉండి నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. ‘‘కేరళ రాష్ట్రంలో పండుగ దినాల్లోనే కరోనా కేసులు పెరిగాయి. అలాగే శ్రావణ మాసం పండుగ రోజుల వల్ల తమిళనాడులో కూడా కేసులు పెరిగే ప్రమాదం ఉంది.
పొరుగు రాష్ట్రాల సరిహద్దులో ఉండే ప్రజలు ప్రతిరోజూ పక్క రాష్ట్రానికి రాకపోకలు సాగిస్తుంటారు. ఈ కేసులన్నీ రాబోయే పది రోజుల్లో బయటపడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వారిలో వందశాతం వ్యాక్సిన్ వేసినట్లు జిల్లా కలెక్టర్లు నిర్ధారించుకోవాలి. థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనగల సమర్థతతో ప్రభుత్వ యంత్రాగం ఉంది’’ అని ఆయన తెలిపారు.
సమృద్ధిగా వ్యాక్సిన్లు
రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ కొరత లేదని, సమృద్ధిగా సరఫరా అవుతోందని డాక్టర్ రాధాకృష్ణన్ తెలిపారు. ఈ నెల కోటా కింద 63.76 లక్షల వ్యాక్సిన్లు తమిళనాడుకు వచ్చాయన్నారు. అదనంగా కేంద్రం మరో 5.89 లక్షల డోసులు పంపించిందని తెలిపారు. మరో 16.75 లక్షల డోసులు పంపనున్నట్లు కేంద్రం తెలిపిందని వివరించారు. వచ్చేనెలకుగానూ 1.04 కోట్ల డోసులు సరఫరా చేయనుందని చెప్పారు. మరో మూడు రోజులకు సరిపడా 14 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ నుంచి 2.35 లక్షల కోవాగ్జిన్ డోసులు శుక్రవారం చెన్నైకి చేరుకున్నాయి.
పాఠశాలల సిబ్బందికి ప్రత్యేక వ్యాక్సిన్ శిబిరం
సెప్టెంబరు 1వ తేదీ నుంచి పాఠశాలలు తెరుస్తున్న నేపథ్యంలో అధ్యాపకులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్ వేసేందుకు చెన్నై సైదాపేటలోని బాలికల ఉన్నత పాఠశాలలో ప్రత్యేక శిబిరాన్ని ఆరోగ్యశాఖా మంత్రి ఎం.సుబ్రమణియన్ శుక్రవారం ప్రారంభించారు. కళాశాల విద్యార్థుల కోసం చెన్నై నందనం కాలేజీలో వ్యాక్సిన్ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి 9–12 తరగతుల విద్యార్థులకు పాఠశాలల్లో బోధనను ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. విద్యార్థులను రెండు బ్యాచ్‌లుగా విభజించి 50 శాతం మందితో తరగతులు నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment