సాక్షి, చెన్నై: వారంతా పోలీస్‌శాఖలో ఉన్నతాధికారులు. అయితేనేం సాధారణ వ్యక్తుల వలె వ్యవహరించారు. డీజీపీ స్థాయి అధికారి మహిళా ఐపీఎస్‌ను లైంగిక వేధింపులకు గురిచేయగా, మరో ముగ్గురు ఐపీఎస్‌లు నిందితుడికి అండగా నిలిచారు. వీరందరిపై శాఖాపరమైన చర్యల కోసం రంగం సిద్ధం అవుతోంది. సీబీసీఐడీ అధికారుల సమాచారం ఇలా ఉంది. మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామికి భద్రతా విధులు నిర్వర్తిస్తున్న ఒక మహిళా ఎస్పీ (ఐపీఎస్ అధికారి)ని స్పెషల్ డీజీపీ తన చాంబర్‌కు పిలిపించుకున్నారు. సీఎం భద్రాతా చర్యల గురించి చర్చించాలని నమ్మబలికి తన కారులో ఎక్కించుకుని లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.
స్పెషల్ డీజీపీపై తమిళనాడు హోంశాఖ కార్యదర్శికి, డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు సదరు మహిళా ఎస్పీ సేలం నుంచి చెన్నైకి బయలుదేరింది. అయితే స్పెషల్ డీజీపీ తన పలుకుబడిని ఉపయోగించి ఆమెను వెళ్లకుండా ఉండేందుకు అడ్డుకునేయత్నం చేశారు. మధ్య మండల ఐజీ, మహిళా డీఐజీ, చెంగల్పట్టు ఎస్పీ సహా 50 మందికి పైగా పోలీసులు చెంగల్పట్టు చెక్‌పోస్టు వద్ద దారికాచి, కారును అడ్డగించి రాజీ చర్చలు జరిపారు. అయితే ఇందుకు ఒప్పుకోని బాధితురాలు ఫిర్యాదు ఇచ్చే తీరుతానని బయలుదేరడంతో ఆమె కారు తాళాలు లాక్కుని ఘర్షణ పడ్డారు. ఎంతో ప్రయాసపడి అనుకున్న ప్రకారం అత్యున్నతాధికారులకు ఫిర్యాదు చేయగలిగారు. ప్రిన్సిపల్ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పడి విచారణ చేపట్టగా స్పెషల్ డీజీపీ చేసిన నేరం నిర్ధారణైంది.
చెంగల్పట్టు చెక్‌పోస్ట్ వద్దనున్న సీసీ కెమెరాల పుటేజ్‌ను పరిశీలించగా ముగ్గురు ఐపీఎస్ అధికారులు కలిసి అక్కడ నడిపిన రాజీ బాగోతం బయటపడింది. దీంతో స్పెషల్ డీజీపీతోపాటు మిగిలిన ముగ్గురు పోలీస్ అధికారులపైనే కేసు నమోదైంది. స్పెషల్ డీజీపీపై సస్పెన్షన్ వేటు పడింది. అయితే ఫిర్యాదు చేయకుండా అడ్డుకున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులపై శాఖాపరమైన విచారణ జరగకపోగా యథావిధిగా వారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ముగ్గురిపై చార్జిషీటు దాఖలుకు వీలుగా తదుపరి చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వానికి సీబీసీఐడీ లేఖ రాసింది. ఈ లేఖ మేరకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ సిఫార్సు కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని బృందం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment