
న్యూఢిల్లీ: అకాల వర్షాలు, అధిక వర్షాలతో కూరగాయల ధరలకు ముఖ్యంగా టమాటా ధరలకు రెక్కలు వచ్చాయి. కిలో రూ.100 వరకు ఉన్న టమాటా ధర ఇప్పట్లో తగ్గే అవకాశాలు లేవని క్రిసిల్ అంచనా వేస్తోంది. మరో రెండు నెలల వరకు టమాటా సామాన్యుడికి అందుబాటులోకి వచ్చేలా కనిపించడం లేదని క్రిసిల్ అధ్యయనం చెబుతోంది. దేశంలో టమాటా అత్యధికంగా పండించే రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటకలో సాధారణ వర్షపాతానికి మించి 105%, ఆంధ్రప్రదేశ్‌లో సాధారణానికి మించి 40%, మహారాష్ట్రలో 22% అధికంగా వానలు నమోదయ్యాయి.
దీంతో, అక్టోబర్–డిసెంబర్ కాలంలో కీలక సరఫరాదారులైన ఈ మూడు రాష్ట్రాల్లో చేతికొచ్చిన టమాటా పంట నేలపాలైందని క్రిసిల్ అంటోంది. దీంతో, నవంబర్ 25 నాటికి 142% మేర ధరలు పెరిగాయి. మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ల నుంచి టమాటా పంట చేతికందే వచ్చే జనవరి వరకు ధరల్లో ఇదే తీరు కొనసాగుతోందని క్రిసిల్ అంచనా వేస్తోంది. కొత్తగా పంట వస్తే టమాటా ధర 30% మేర తగ్గుతుందని చెబుతోంది.
అయితే, టమాటా అధిక ధరల ప్రభావం డిసెంబర్ నుంచి తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి టమాటా తాజా పంట మార్కెట్‌లోకి రావడం మొదలైతే ధరలు దిగివస్తాయని పేర్కొంది. ఉల్లి ధరలు కూడా మరో 10–15 రోజుల తర్వాతే తగ్గుతాయని క్రిసిల్ తెలిపింది. అత్యధికంగా సాగయ్యే మహారాష్ట్రలో తక్కువ వర్షపాతంతో ఆగస్ట్‌లో సాగు ఆలస్యమైంది. దీంతో, పంట ఆలస్యం కావడంవల్ల ధరలు 65% పెరిగాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment