కొంతమందికి 2023వ సంవత్సరం ఆనందంగా గడిస్తే, మరికొందరికి వారి జీవితంలో అత్యంత భయంకరమైన అనుభవాలను మిగిల్చింది. 2023వ సంవత్సరంలో దేశంలో చోటుచేసుకున్న 10 అత్యంత దారుణాల గురించి ఇప్పుడు చూద్దాం.
1. ఉమేష్ పాల్ హత్య
దేశంలో అత్యంత చర్చనీయాంశమైన హత్య కేసుల్లో ఉమేష్ పాల్ హత్య ఒకటి. యూపీలోని ప్రయాగ్‌రాజ్ పరిధిలోని ధుమన్‌గంజ్ పోలీస్ స్టేషన్ సమీపంలో బీఎస్‌పీ మాజీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్యకు ప్రధాన సాక్షి అయిన ఉమేష్ పాల్ తుపాకీ తూటాలకు హతమయ్యాడు. ఇది యూపీలో గ్యాంగ్ వార్‌ను మరోమారు గుర్తుచేసింది. ఉమేష్ పాల్‌పై బుల్లెట్లు, బాంబులతో దాడి చేసినట్లు సీసీటీవీలో స్పష్టంగా కనిపించింది. ఈ కేసు దర్యాప్తులో ఉంది.
2. అతిక్, అష్రాఫ్ హత్యలు
పూర్వాంచల్ మాఫియా లీడర్లుగా పేరొందిన అతిక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్‌లు ప్రయాగ్‌రాజ్ మెడికల్ కాలేజీ సమీపంలో హత్యకు గురయ్యారు. పోలీసుల సంరక్షణలో ఉన్న అతిక్, అష్రఫ్ అహ్మద్‌లపై దుండగులు అనేక రౌండ్లు కాల్పులు జరిపి హత్యచేశారు. పోలీసు కస్టడీలో ఉన్న అతిక్ అహ్మద్‌తో ఒక జర్నలిస్టు మాట్లాడుతుండగా నిందితులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ అక్కడికక్కడే మృతి చెందారు. కాల్పులు జరిపిన ముగ్గురు నిందితులు పోలీసులకు పట్టబడ్డారు.
3. నిక్కీ యాదవ్ దారుణ హత్య
ఢిల్లీలో నిక్కీ యాదవ్ హత్య.. యావత్ దేశాన్ని కుదిపేసింది. ఫిబ్రవరి 10న నిక్కీ యాదవ్‌ను ఆమె ప్రియుడు సాహిల్ గొంతుకోసి హత్య చేశాడు. సాహిల్ ఫిబ్రవరి 10న ఇంకొకరిని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుసుకున్న నిక్కీ అతనితో గొడవ పడింది. సాహిల్ కోపంతో నిక్కీని గొంతుకోసి హత్య చేశాడు. తరువాత నిక్కీ మృతదేహాన్ని తన దాబాలోని ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. అనంతరం రెండవ వివాహం చేసుకున్నాడు. ఈ కేసు దర్యాప్తులో ఉంది.
4. రాజ్‌పుత్ కర్ణి సేన జాతీయ అధ్యక్షుని హత్య
రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. సుఖ్‌దేవ్ సింగ్‌ను అంతమొందించే ప్లాన్‌తో వచ్చిన ఇద్దరు ముష్కరులు అతని ఇంటిలో కాసేపు కూర్చుని మాట్లాడారు. తరువాత వారిద్దరూ తమ తుపాకీలను తీసి సుఖ్‌దేవ్ సింగ్‌పై కాల్పులు జరిపారు. దీంతో సుఖ్‌దేవ్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంతలో నిందితులు అక్కడి నుండి పారిపోయారు. అయితే నిందితులను చండీగఢ్‌లోని సెక్టార్ -22లో ఉన్న హోటల్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో చోటుచేసుకుంది.
5. మైనర్ బాలిక దారుణ హత్య
ఢిల్లీలోని షహబాద్ డెయిరీ ప్రాంతంలో ఓ మైనర్ బాలిక దారుణ హత్య దేశాన్ని కుదిపేసింది. ఈ హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్‌గా మారింది. దానిలో నిందితుడు మైనర్ బాలికపై కత్తితో దాడి చేస్తున్నా అక్కడున్న ఎవరూ పట్టించుకోకపోవడం కనిపిస్తుంది. నిందితుడు సాహిల్ ఈ 16 ఏళ్ల మైనర్‌పై 20 సార్లు కత్తులతో దాడి చేశాడు. తరువాత ఆ బాలికను రాయితో మోది హత్య చేశాడు.
6. డియోరియా ఊచకోత
యూపీలోని డియోరియా జిల్లా రుద్రాపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సహా మొత్తం ఆరుగురి హత్య దేశాన్ని కుదిపేసింది. భూ వివాదాల కారణంగానే ఈ హత్య జరిగింది. ఇందులో ఒక పార్టీకి చెందిన సత్య ప్రకాష్ దూబే, ఆయన భార్య కిరణ్, కుమార్తె సలోని, నందిని, కుమారుడు గాంధీ హత్యకు గురయ్యారు. జిల్లా పంచాయతీ మాజీ సభ్యుడు ప్రేమ్ యాదవ్ కూడా హత్యకు గురయ్యారు.
7. కానిస్టేబుల్ కాల్పులు
జైపూర్-ముంబై ఎక్స్‌ప్రెస్ రైలులో ఆర్‌పిఎఫ్ జవాన్ విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంఘటన ఈ సంవత్సరం కలకలం రేపింది. జూలై 31 ఉదయం, జైపూర్-ముంబై రైలులో ఒక ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ తన సీనియర్‌పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. మృతుల్లో ఆర్పీఎఫ్ ఏఎస్ఐ, ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటన వాపి, బోరివాలి మీరా రోడ్ స్టేషన్ల మధ్య జరిగింది.
8. లక్నో కోర్టులో బుల్లెట్ల శబ్దం
యూపీలోని లక్నోలోని కోర్టులో గ్యాంగ్‌స్టర్ సంజీవ్ జీవాను కాల్చి చంపారు. జూన్ 7న విచారణ కోసం గ్యాంగ్‌స్టర్ సంజీవ్ జీవాను లక్నో కోర్టుకు తీసుకువచ్చారు. ఇంతలో లాయర్ల వేషంలో వచ్చిన దుండగులు కోర్టు ఆవరణలోనే సంజీవ్ జీవాపై కాల్పులు జరిపారు. సంజీవ్ జీవా అక్కడికక్కడే మృతిచెందాడు. సంజీవ్ జీవా ముజఫర్‌నగర్ నివాసి. లక్నో జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.
9. రూ.350 కోసం దారుణ హత్య
కేవలం రూ.350 కోసం 16 ఏళ్ల యువకుడు మరో టీనేజర్‌ను అత్యంత దారుణంగా అంతమొందించాడు. ఈశాన్య ఢిల్లీలోని వెల్‌కమ్ ఏరియాలో జరిగిన ఈ ఘటన సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యింది. టీనేజర్ తల, మెడపై నిందితుడు 60 సార్లు కత్తితో పొడిచాడు. ప్రాణాలు కోల్పోయిన టీనేజర్‌ను చూసి ఆ యువకుడు డ్యాన్స్ చేయటం సీసీటీవీ వీడియోలో కనపడింది. ఈ దారుణ హత్యకు పాల్పడిన 16 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
10. పట్టపగలు దుకాణదారుని హత్య
పంజాబ్‌లోని భటిండాలో పట్టపగలు ఓ దుకాణదారుని కాల్చి చంపిన ఉదంతం దేశాన్ని కుదిపేసింది. ఈ హత్య ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్‌గా మారింది. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో దుకాణదారుడు హర్జిందర్ సింగ్ అలియాస్ మేలా తన దుకాణం ముందు కుర్చీలో కూర్చున్నట్లు ఈ సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తుంది. ఇంతలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు దుండగులు వచ్చి పిస్టల్స్‌తో హర్జిందర్‌పై కాల్పులు జరిపారు. దుండగులిద్దరూ ముఖాలకు మాస్క్‌లు కప్పుకున్నారు. ఆరు రౌండ్లు కాల్పులు జరిపిన అనంతరం దుండగులిద్దరూ బైక్‌పై పారిపోయారు. బాధితుడు హర్జిందర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
ఇది కూడా చదవండి: 2023 సామాన్యునికి ఏమిచ్చింది?
Comments
Please login to add a commentAdd a comment