
కోల్‌కతా: బీజేపీ నేత సువేందు అధికారి తనపై చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ మండిపడ్డారు. జనవరి 19న ఖేజూరిలో జరిగిన బహిరంగ సభలో తన పరువుకు భంగం కలిగే విధంగా అసత్యమైన ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ సువేందు అధికారికి లీగల్ నోటీసులు పంపారు. 36 గంటల్లో బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే, అతనిపై చట్టపరమైన చర్యలను ప్రారంభిస్తామని అభిషేక్ బెనర్జీ తరపున లాయర్ పేర్కొన్నారు. క్రిమినల్ కేసుల్లో నిందితుడైన సువేందు.. తనపై నిరాధారమైన ఆరోపణలు చేయడం ఏంటని అభిషేక్ ప్రశ్నించారు. అహంకారంతో విర్రవీగుతున్న సువేందు.. ప్రజలకు వ్యతిరేకంగా చేసిన నేరాలను మరిచిపోయారని ధ్వజమెత్తారు. శారదా చిట్ ఫండ్ స్కాం, నారద లంచం కేసుల్లో సువేందు ప్రమేయాన్ని నోటీసుల్లో ప్రస్థావించారు. అభిషేక్ బెనర్జీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి స్వయానా మేనల్లుడు.
కాగా, గతంలో టీఎంసీ కీలక నేతల్లో ఒకరైన సువేందు.. మమతా బెనర్జీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా వ్యవహరించారు. ఆయన ఇటీవలే టీఎంసీని వీడి బీజేపీలో చేరారు. సువేందుతో పాటు పలువురు టీఎంసీ నేతలు కమల తీర్ధం పుచ్చుకున్నారు. త్వరలో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. అధికార టీఎంసీ, భాజపాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మమతను గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనేతలు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా తమ పార్టీలో చేర్చుకుంటున్నారు.