Triyuginarayan: Where Lord Shiva Goddess Parvati Got a Marriage - Sakshi
Sakshi News home page

అఖండ ధూని ఆలయం: సత్య యుగంలో శివపార్వతుల వివాహాన వెలిగిన హోమం ఇప్పటికీ..

Published Sat, Feb 18 2023 3:43 PM | Last Updated on Sat, Feb 18 2023 4:53 PM

Triyuginarayan Where Lord Shiva Goddess Parvati Got Marriage - Sakshi

మహాశివరాత్రి.. పరమ శివుడికి ఎంతో ప్రత్యేకం. భక్తులు పగలు పూజలతో ఉపవాసాలతో.. రాత్రంతా జాగారం చేస్తూ ఆ భోళాశంకరుడిని ఉపాసిస్తారు. ఈ పవిత్ర దినాన ఆ లయకారుడు తాండవం ప్రదర్శిస్తాడని ప్రశస్తి. అదే విధంగా.. శివపార్వతుల వివాహ సందర్భమే మహాశివరాత్రిగా చెప్తుంటారు. ఈ సందర్భంగా ఓ ఆలయం గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. ఆదిదంపతుల్లాగా అన్యోన్యంగా ఉండాలంటే ఈ ఆలయాన్ని తప్పక దర్శించాలం‍టారు!.

త్రియుగీ నారాయణ్ ఆలయం. ఇది విష్ణుమూర్తికి చెందిన అత్యంత ప్రాచీనాలయం.  పౌరాణికంగానూ ఈ ఆలయానికి ప్రశస్తి ఉంది. వైష్ణవుల ప్రకారం త్రియుగీ నారాయణ్ విష్ణువు ఆదిస్థానం, నిత్య నివాసస్థానం. కానీ.. శైవులు ఈ ఆలయాన్ని, ప్రాంతాన్ని పుణ్యస్థలిగా భావిస్తారు. ఎందుకంటే.. శివపార్వతుల వివాహం జరిగిన వేదికగా ఈ ప్రాంతానికి పురాణాల్లో పేరుంది. పైగా ఈ వివాహ వేడుకకు బ్రహ్మవిష్ణులే సాక్షులుగా వ్యవహరించారని చెప్తుంటారు. 

పురాతనమయిన పవిత్ర స్థలము త్రియుగీ నారాయణ్ గ్రామం. పార్వతి పరమేశ్వరుల వివాహస్దలంగా భక్తులు నమ్ముతారు. ఈ ఆలయంలోపల రెండు అడుగుల ఎత్తు ఉన్న శ్రీలక్ష్మినారాయణుల మూర్తులు ఉన్నాయి. ఎదురుగా హోమగుండం ఉంటుంది. ఆ గుండం శివపార్వతుల వివాహం నుంచి మూడు యుగాలుగా(సత్య, త్రేతా, ద్వాపర యుగాలు.. ఇప్పుడు కలి యుగం) అలా వెలుగుతూనే ఉన్నదని  చెప్తుంటారు. అందుకే ఈ ఆలయానికి అఖండ ధూని(నిరంతరం వెలుగుతూ ఉంటుందని ) ఆలయం అనే మరో పేరు కూడా ఉంది.

ఇక హోమం కోసం ప్రత్యేకంగా అక్కడొక మనిషి ఉంటాడు. ఒక దుంగ కాలిన తరువాత మరొక దుంగను వేస్తూ మంటను ఆరకుండా చూస్తుంటారు. అక్కడికి వచ్చే భక్తులు  కూడా హోమకుండంలో తలొక కర్రముక్క వేస్తారు. అందులోని విభూతిని అతి పవిత్రమైనదిగా భావిస్తారు. దాంపత్యం సజావుగా సాగుతుందనే నమ్మకంతో ఆ విభూతిని తమ వెంట తీసుకెళ్తారు కూడా. మూడు యుగాలు దాటినా ఆ హోమం వెలుగుతూనే ఉండడం.. అందుకు శ్రీమన్నారాయణుడే సాక్షిగా ఉండడంతో ఈ ఆలయానికి  త్రియుగి నారాయణ్ అనే పేరు వచ్చిందని స్థలపురాణం చెబుతోంది.

ఇక..  త్రియుగి నారాయణ్ ఆలయం, కేదార్‌నాథ్‌ నిర్మాణశైలిని పోలి ఉంటుంది. ఆలయం ఎదురుగా బ్రహ్మ శిల వద్ద  సత్య యుగంలో శివపార్వతుల వివాహం జరిగింది అని స్దలపురాణం.  బయట ఒక చిన్నమందిరం ఉంది. నాలుగు మూలలా రాతి స్తంభాలు, రాతి పైకప్పుమాత్రం ఉండి, మందిరం మధ్యలో నేలమీద నుంచి కొద్దిగా ఎత్తులో ఒక రాతిపలక పానవట్టంలాగ ఉండి మధ్యలో ఒక చిన్న శివలింగం కనిపిస్తుంది.

ఆలయం బయట ప్రాంగణములో రుద్ర, విష్ణు, బ్రహ్మ కుండములు ఉంటాయి. ఈ ఆలయ ప్రాంగణంలో సరస్వతీ కుండము..  చుట్టుపక్కల ఉన్న మూడు కుండములను  నింపుతుంది. అయితే ఇది విష్ణువు నాభి నుంచి పుట్టిందని చెప్తుంటారు. శివపార్వతుల వివాహానికి ముందు దేవతలందరూ రుద్ర, విష్ణు, బ్రహ్మ కుండములలో స్నానం ఆచరించారనేది స్థల పురాణం. 

ఉత్తరాఖండ్‌ రుద్రప్రయాగ జిల్లా త్రియుగీ నారాయణ్ గ్రామంలో ఉంది ఈ ఆలయం. వేసవి కాలంలో ఈ ప్రాంతం సందర్శనానికి అనుకూలం. దీనిని ఆదిశంకరాచార్యులు నిర్మించారని నమ్ముతారు. ఉత్తరాఖండ్ ప్రాంతంలో అనేక దేవాలయాలను నిర్మించిన ఘనత ఆదిశంకరాచార్యులదే.

పురాణేతిహాస సాహిత్యంలో సతి, పార్వతి గురించిన కథలు ఉన్నాయి. దక్షుని కుమార్తె అయిన 'సతీదేవి' (దాక్షాయణి) శివునికి ఇల్లాలు. కాని దక్షయజ్ఞంలో తనకు, శివునికి జరిగిన అవమానానికి క్షోభించి ఆమె అగ్నిలో ఆహుతి అయ్యింది. తరువాత ఆమె హిమవంతుడు, మేనకల కుమార్తెగా జన్మించింది. పర్వత రాజ తనయ గనుక 'పార్వతి' అని ఆమె పిలువబడింది. మొదట ఆమె తన మేని వర్చస్సుతో పరమశివుడ్ని ఆకట్టుకునే యత్నం చేసింది. ఫలితం లేదు. ఆపై మనస్ఫూర్తిగా గౌరీ కుండ్‌ వద్ద కఠోరమైన తపసు ఆచరించి శివుని వరించింది. ఈ తపస్సు వల్లే ఆమెకు ఉమ, అపర్ణ అనే పేర్లు వచ్చాయి. ఆపై ఆమె తపస్సుకి మెచ్చి శివుడు.. గుప్తకాశీ వద్ద పార్వతీదేవిని వివాహం చేసుకోవాలని కోరినట్లు పురాణంలో ఉంది.  ఆమెను తన శరీరంలో సగంగా స్వీకరించి అర్థనారీశ్వరుడు అయ్యాడు. 

గౌరీ కుండ్‌.. త్రియుగీ నారాయణ్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. త్రియుగీ నారాయణ్‌కు వెళ్లే భక్తులు గౌరీ కండ్‌లో ఉన్న పార్వతీ ఆలయాన్ని కూడా సందర్శిస్తారు. కేదార్‌నాథ్‌ ఆలయానికి ఇది బేస్‌ క్యాంప్‌గా ఉంటుంది. త్రియుగీ నారాయణ్‌ గ్రామం వద్ద మందాకినీ- సోన్‌గంగా నదులు సంగమిస్తాయి. ఇది హిమంతుడి రాజధానిగా చెప్తారు. పార్వతీ దేవికి సోదరుడిగా విష్ణువు వ్యవహరించగా, బ్రహ్మ ఆ వివాహాన్ని జరిపించాడని స్థల పురాణంలో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement