Rudraprayag district
-
కేదార్‌నాథ్‌కు పోటెత్తుతున్న భక్తులు
ఉత్తరాఖండ్‌లో కొలువైన కేదార్నాథ్ దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ తగిన కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది. భక్తుల రద్దీని అనుసరించి గంటకు 1,800 మందికి పైగా భక్తులు కేదార్‌నాథ్‌ను దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే భక్తులు అర్ధరాత్రి 12 గంటల వరకు స్వామివారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించారు.గత మే నెలలోని 31 రోజుల్లో 5,54,671 మంది భక్తులు కేదార్‌నాథ్‌ను దర్శించుకున్నారు. చార్ధామ్ యాత్రకు ప్రభుత్వం ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించిన నేపథ్యంలో జూన్ రెండవవారం నుంచి భక్తుల రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉంది. కేదార్‌నాథ్‌లో దర్శన వ్యవస్థను మరింత సులభతరం చేసేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. రోజుకు 36 వేల మంది భక్తులకు దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు.కేదారేశ్వరుని దర్శనం ఉదయం 4.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3.30 వరకు కొనసాగుతుంది. అనంతరం స్వామివారికి బాల భోగం సమర్పిస్తారు. దీని కారణంగా ఆలయాన్ని కొద్దిసేపు మూసివేస్తారు. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి మొదలై 7 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. -
దేశంలో లైబ్రరీ విలేజ్ ఎక్కడుంది? ఆ పేరెలా వచ్చింది?
పుస్తకాలు మనిషికి మంచి నేస్తాలని చెబుతుంటారు. పుస్తకాలు మనకు ప్రపంచంలోని సమస్త సమాచారాన్ని అందిస్తాయి. మంచి పుస్తకం మానసిక సంతోషాన్ని కలుగజేస్తుంది. అలాంటి పుస్తకాలకు ఒక గ్రామం నెలవుగా ఉందని, అందుకే ఆ గ్రామానికి లైబ్రరీ విలేజ్ అనే పేరు వచ్చిందనే సంగతి మీకు తెలుసా? ఉత్తరాఖండ్‌లోని అందమైన పర్వత లోయల మధ్య పుస్తక ప్రపంచం ఉంది. 17,500కు మించిన పుస్తకాల సేకరణ ఇక్కడ కనిపిస్తుంది. రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న అగస్త్యముని బ్లాక్‌లోని మణిగుహ్ గ్రామం లైబ్రరీ విలేజ్‌గా పేరు పొందింది. ఇందుకు ‘హమారా గావ్ ఘర్’ ఫౌండేషన్ సహకారం అందించింది. 1,664 మీటర్ల ఎత్తులో ఉన్న మణిగుహ్ గ్రామం ఎంతో అందంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ 250 కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలో హోమ్‌స్టేలు కూడా ఉన్నాయి. 2023, జనవరి 26న హమారా గావ్ ఘర్ ఫౌండేషన్‌ను నెలకొల్పామని లైబ్రరీ డైరెక్టర్ మహేష్ నేగి మీడియాకు తెలిపారు. ఈ ఫౌండేషన్ లక్ష్యం గ్రామాల్లో విద్యాభివృద్ధిని పెంపొందించడం. గ్రామంలోని ఈ లైబ్రరీలో పుస్తకాలు చదివేందుకు ఎటువంటి రుసుము వసూలు చేయరు. ప్రతిరోజు విద్యార్థుల తమ తరగతులు ముగిసిన తర్వాత లైబ్రరీకి చేరుకుని చదువుకుంటారు. గ్రామంలో లైబ్రరీ ప్రారంభించినప్పుడు మూడు రోజుల పాటు గావ్ ఘర్ మహోత్సవ్ నిర్వహించామని మహేశ్ నేగి తెలిపారు. రైతులు, కవులు, రంగస్థల కళాకారులతో సహా సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో ఉత్తరాఖండ్‌లోని అనేక ప్రాంతాల్లో లైబ్రరీలు తెరుచుకున్నాయి. కాగా మణిగుహ్లో ఏర్పాటైన లైబ్రరీలో పోటీ పరీక్షలు మొదలుకొని సాహిత్యం వరకూ వివిధ రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. -
విష్ణువుకేమో ఆదిస్థానం.. శివభక్తులకు ఎంతో ప్రత్యేకం
మహాశివరాత్రి.. పరమ శివుడికి ఎంతో ప్రత్యేకం. భక్తులు పగలు పూజలతో ఉపవాసాలతో.. రాత్రంతా జాగారం చేస్తూ ఆ భోళాశంకరుడిని ఉపాసిస్తారు. ఈ పవిత్ర దినాన ఆ లయకారుడు తాండవం ప్రదర్శిస్తాడని ప్రశస్తి. అదే విధంగా.. శివపార్వతుల వివాహ సందర్భమే మహాశివరాత్రిగా చెప్తుంటారు. ఈ సందర్భంగా ఓ ఆలయం గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. ఆదిదంపతుల్లాగా అన్యోన్యంగా ఉండాలంటే ఈ ఆలయాన్ని తప్పక దర్శించాలంటారు!. త్రియుగీ నారాయణ్ ఆలయం. ఇది విష్ణుమూర్తికి చెందిన అత్యంత ప్రాచీనాలయం. పౌరాణికంగానూ ఈ ఆలయానికి ప్రశస్తి ఉంది. వైష్ణవుల ప్రకారం త్రియుగీ నారాయణ్ విష్ణువు ఆదిస్థానం, నిత్య నివాసస్థానం. కానీ.. శైవులు ఈ ఆలయాన్ని, ప్రాంతాన్ని పుణ్యస్థలిగా భావిస్తారు. ఎందుకంటే.. శివపార్వతుల వివాహం జరిగిన వేదికగా ఈ ప్రాంతానికి పురాణాల్లో పేరుంది. పైగా ఈ వివాహ వేడుకకు బ్రహ్మవిష్ణులే సాక్షులుగా వ్యవహరించారని చెప్తుంటారు. పురాతనమయిన పవిత్ర స్థలము త్రియుగీ నారాయణ్ గ్రామం. పార్వతి పరమేశ్వరుల వివాహస్దలంగా భక్తులు నమ్ముతారు. ఈ ఆలయంలోపల రెండు అడుగుల ఎత్తు ఉన్న శ్రీలక్ష్మినారాయణుల మూర్తులు ఉన్నాయి. ఎదురుగా హోమగుండం ఉంటుంది. ఆ గుండం శివపార్వతుల వివాహం నుంచి మూడు యుగాలుగా(సత్య, త్రేతా, ద్వాపర యుగాలు.. ఇప్పుడు కలి యుగం) అలా వెలుగుతూనే ఉన్నదని చెప్తుంటారు. అందుకే ఈ ఆలయానికి అఖండ ధూని(నిరంతరం వెలుగుతూ ఉంటుందని ) ఆలయం అనే మరో పేరు కూడా ఉంది. ఇక హోమం కోసం ప్రత్యేకంగా అక్కడొక మనిషి ఉంటాడు. ఒక దుంగ కాలిన తరువాత మరొక దుంగను వేస్తూ మంటను ఆరకుండా చూస్తుంటారు. అక్కడికి వచ్చే భక్తులు కూడా హోమకుండంలో తలొక కర్రముక్క వేస్తారు. అందులోని విభూతిని అతి పవిత్రమైనదిగా భావిస్తారు. దాంపత్యం సజావుగా సాగుతుందనే నమ్మకంతో ఆ విభూతిని తమ వెంట తీసుకెళ్తారు కూడా. మూడు యుగాలు దాటినా ఆ హోమం వెలుగుతూనే ఉండడం.. అందుకు శ్రీమన్నారాయణుడే సాక్షిగా ఉండడంతో ఈ ఆలయానికి త్రియుగి నారాయణ్ అనే పేరు వచ్చిందని స్థలపురాణం చెబుతోంది. ఇక.. త్రియుగి నారాయణ్ ఆలయం, కేదార్నాథ్ నిర్మాణశైలిని పోలి ఉంటుంది. ఆలయం ఎదురుగా బ్రహ్మ శిల వద్ద సత్య యుగంలో శివపార్వతుల వివాహం జరిగింది అని స్దలపురాణం. బయట ఒక చిన్నమందిరం ఉంది. నాలుగు మూలలా రాతి స్తంభాలు, రాతి పైకప్పుమాత్రం ఉండి, మందిరం మధ్యలో నేలమీద నుంచి కొద్దిగా ఎత్తులో ఒక రాతిపలక పానవట్టంలాగ ఉండి మధ్యలో ఒక చిన్న శివలింగం కనిపిస్తుంది. ఆలయం బయట ప్రాంగణములో రుద్ర, విష్ణు, బ్రహ్మ కుండములు ఉంటాయి. ఈ ఆలయ ప్రాంగణంలో సరస్వతీ కుండము.. చుట్టుపక్కల ఉన్న మూడు కుండములను నింపుతుంది. అయితే ఇది విష్ణువు నాభి నుంచి పుట్టిందని చెప్తుంటారు. శివపార్వతుల వివాహానికి ముందు దేవతలందరూ రుద్ర, విష్ణు, బ్రహ్మ కుండములలో స్నానం ఆచరించారనేది స్థల పురాణం. ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ జిల్లా త్రియుగీ నారాయణ్ గ్రామంలో ఉంది ఈ ఆలయం. వేసవి కాలంలో ఈ ప్రాంతం సందర్శనానికి అనుకూలం. దీనిని ఆదిశంకరాచార్యులు నిర్మించారని నమ్ముతారు. ఉత్తరాఖండ్ ప్రాంతంలో అనేక దేవాలయాలను నిర్మించిన ఘనత ఆదిశంకరాచార్యులదే. పురాణేతిహాస సాహిత్యంలో సతి, పార్వతి గురించిన కథలు ఉన్నాయి. దక్షుని కుమార్తె అయిన 'సతీదేవి' (దాక్షాయణి) శివునికి ఇల్లాలు. కాని దక్షయజ్ఞంలో తనకు, శివునికి జరిగిన అవమానానికి క్షోభించి ఆమె అగ్నిలో ఆహుతి అయ్యింది. తరువాత ఆమె హిమవంతుడు, మేనకల కుమార్తెగా జన్మించింది. పర్వత రాజ తనయ గనుక 'పార్వతి' అని ఆమె పిలువబడింది. మొదట ఆమె తన మేని వర్చస్సుతో పరమశివుడ్ని ఆకట్టుకునే యత్నం చేసింది. ఫలితం లేదు. ఆపై మనస్ఫూర్తిగా గౌరీ కుండ్ వద్ద కఠోరమైన తపసు ఆచరించి శివుని వరించింది. ఈ తపస్సు వల్లే ఆమెకు ఉమ, అపర్ణ అనే పేర్లు వచ్చాయి. ఆపై ఆమె తపస్సుకి మెచ్చి శివుడు.. గుప్తకాశీ వద్ద పార్వతీదేవిని వివాహం చేసుకోవాలని కోరినట్లు పురాణంలో ఉంది. ఆమెను తన శరీరంలో సగంగా స్వీకరించి అర్థనారీశ్వరుడు అయ్యాడు. గౌరీ కుండ్.. త్రియుగీ నారాయణ్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. త్రియుగీ నారాయణ్‌కు వెళ్లే భక్తులు గౌరీ కండ్లో ఉన్న పార్వతీ ఆలయాన్ని కూడా సందర్శిస్తారు. కేదార్నాథ్ ఆలయానికి ఇది బేస్ క్యాంప్‌గా ఉంటుంది. త్రియుగీ నారాయణ్ గ్రామం వద్ద మందాకినీ- సోన్గంగా నదులు సంగమిస్తాయి. ఇది హిమంతుడి రాజధానిగా చెప్తారు. పార్వతీ దేవికి సోదరుడిగా విష్ణువు వ్యవహరించగా, బ్రహ్మ ఆ వివాహాన్ని జరిపించాడని స్థల పురాణంలో ఉంది. -
ఢిల్లీలో భూకంపం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ఉత్తర భారత రాష్ట్రాల్లో సోమవారం రాత్రి 10.30 గంటలకు భూకం పం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రతతో వచ్చిన ఈ భూకంప కేంద్రం ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో భూమికి 33 కిలోమీటర్ల దిగువన నమోదైంది. ఢిల్లీ, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లలో దీని ప్రభావం కనిపించింది. హరియాణాలోని గురుగ్రామ్, ఫరీదాబాద్, రోహ్తక్, అంబాలా తదితర చోట్ల, పంజాబ్‌లోని మొహాలీ, పటియాలా, రూపార్, లుధియానా, జలంధర్లలో, ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ప్రకంపనలు వచ్చాయి. పెద్ద సంఖ్యలో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ‘మంచం, సీలింగ్ ఫ్యాన్ ఊగిపోయాయి’అని నోయిడా వాసులు చెప్పారు. ప్రాణ, ఆస్తినష్టం జరిగినట్లు వార్తలేవీ రాలేదు. ప్రధాని మోదీ అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. హిమాలయ పర్వతశ్రేణిలోకి వచ్చే ఉత్తరాఖండ్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తుండడం తెలిసిందే.