
ఉత్తరాఖండ్‌లో కొలువైన కేదార్‌నాథ్ దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ తగిన కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది. భక్తుల రద్దీని అనుసరించి గంటకు 1,800 మందికి పైగా భక్తులు కేదార్‌నాథ్‌ను దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే భక్తులు అర్ధరాత్రి 12 గంటల వరకు స్వామివారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించారు.
గత మే నెలలోని 31 రోజుల్లో 5,54,671 మంది భక్తులు కేదార్‌నాథ్‌ను దర్శించుకున్నారు. చార్‌ధామ్ యాత్రకు ప్రభుత్వం ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించిన నేపథ్యంలో జూన్ రెండవవారం నుంచి భక్తుల రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉంది. కేదార్‌నాథ్‌లో దర్శన వ్యవస్థను మరింత సులభతరం చేసేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. రోజుకు 36 వేల మంది భక్తులకు దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు.
కేదారేశ్వరుని దర్శనం ఉదయం 4.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3.30 వరకు కొనసాగుతుంది. అనంతరం స్వామివారికి బాల భోగం సమర్పిస్తారు. దీని కారణంగా ఆలయాన్ని కొద్దిసేపు మూసివేస్తారు. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి మొదలై 7 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment