పన్నీరు వస్తే.. ఆహ్వానానికి రెడీ | TTV Dhinakaran Says We Will Welcome To Panneerselvam | Sakshi
Sakshi News home page

పన్నీరు వస్తే.. ఆహ్వానానికి రెడీ

Published Sun, Feb 21 2021 8:37 AM | Last Updated on Sun, Feb 21 2021 8:37 AM

TTV Dhinakaran Says We Will Welcome To Panneerselvam - Sakshi

సాక్షి, చెన్నై: విశ్రాంతిలో ఉన్న శశికళ ఇక, రాజకీయ దూకుడు పెంచబోతున్నారు. కేడర్‌లోకి చొచ్చుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈనెల 24న  జయలలిత జయంతి రోజున ముఖ్యులతో భేటీ, ఆలయ దర్శనానికి చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. జైలు నుంచి టీనగర్‌ ఇంటికి చేరిన శశికళ వైద్యుల సూచన మేరకు స్వీయ నిర్భంధంలో ఉన్నట్టు సమాచారం వెలువడింది. వారం రోజులు చిన్నమ్మ ఇంటి నుంచి బయటకు రాలేదు. ఈ పరిస్థితుల్లో ఈనెల 22న జయలలిత జయంతి సందర్భంగా రాజకీయ వ్యవహారాలపై దృష్టి పెట్టేందుకు శశికళ నిర్ణయించారు.

వైద్యులతో సంప్రదించినానంతరం కేడర్‌లోకి చొచ్చుకెళ్లే రీతిలో కార్యక్రమాలపై దృష్టి పెట్టబోతున్నారు. జయంతి రోజున ఇంటి వద్దే జయలలిత చిత్ర పటానికి నివాళర్పించే శశికళ ముఖ్యులతో భేటీకి నిర్ణయించారు. వీరితోపాటు అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగంకు చెందిన వారితో భేటీ కానుండడంతో ఇక రాజకీయంగా దూకుడు పెంచ వచ్చన్న చర్చ జోరందుకుంది. అదేరోజు నగరంలోని ఓ ఆలయంలో ప్రత్యేక పూజలకు తగ్గ ఏర్పాట్లలో శశికళ ఉన్నట్టు సమాచారం. 

పన్నీరు వస్తే ఆహ్వానం.. 
సీఎం కుర్చీలో తనను కూర్చోబెట్టడంలో చిన్నమ్మ పాత్ర ఏమిటో అన్న విషయం గురించి పన్నీరుకు బాగానే తెలుసునని అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం నేత దినకరన్‌ వ్యాఖ్యానించారు. శనివారం దినకరన్‌ మీడియాతో మాట్లాడుతూ ఆయన భరతుడు అయితే, చిన్నమ్మ పక్షాన నిలబడేందుకు సిద్ధంగా ఉంటే, ఆహ్వానించేందుకు తామూ రెడీ అని ప్రకటించారు.

ఆయన అసంతృప్తితో ఉన్న మాట వాస్తవేమని, ఆయన వస్తానంటే, ఆదరించేందుకు చిన్నమ్మ సిద్ధమేనని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తాము బీజేపీతో సంప్రదింపులు జరపలేదని, ఎవ్వరిపై ఓత్తిడి తీసుకు రాలేదని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. డీఎంకే అధికారంలోకి రాకూడదన్నదే తమ లక్ష్యం అని పేర్కొన్నారు.  

జయంతి సభలు.. 
ఈనెల 24న జయలలిత జయంతి వేడుకల్ని బ్రహ్మాండంగా నిర్వహించేందుకు అన్నాడీఎంకే, అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం వేర్వేరుగా సిద్ధమయ్యాయి. సేవా కార్యక్రమాలో పరుగులు తీయనున్నాయి. అన్నాడీఎంకే నేతృత్వంలో ప్రజాకర్షణ దిశగా బహిరంగ సభలకు ఏర్పాట్లు చేస్తున్నారు. చెన్నై ఆర్కేనగర్‌లో జరిగే సభలో సీఎం పళనిస్వామి, బోడినాయకనూర్‌లో డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం పాల్గొననున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement