థానే: బుల్లి తెర నటి తునీషా శర్మ ఆత్మహత్యకు కారణమైన షీజాన్ ఖాన్‌ను కఠినంగా శిక్షించాలని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆమె తల్లికి రూ.25లక్షలు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. థానే జిల్లాలోని భయందర్‌లోని తునీషా శర్మ నివాసంలో ఆమె తల్లి వనితను గురువారం అథవాలే పరామర్శించారు.
కూతురు అకాల మరణానికి న్యాయం చేయడంలో పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తునీషా శర్మను సహనటుడు షీజాన్ ఖాన్ నమ్మించి మోసం చేయడం వల్లే ఆత్మహత్యకు పాల్పడిందని పేర్కొన్నారు. షీజాన్ ఖాన్‌కు ఉరిశిక్ష వేయాలని ఆయన డిమాండ్ చేశారు. తునీషా శర్మను కోల్పోవడం ఆమె తల్లికి తీరని లోటని, రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు నష్టపరిహారంగా రూ.25లక్షలు చెల్లించాలని కోరారు.
తమ పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) తరఫున ఆమెకు రూ.3లక్షలు నష్టపరిహారం ప్రకటించారు. తునీషా శర్మకు న్యాయం జరిగేందుకు ఉజ్జ్వల్ నికమ్‌ను ప్రత్యేక ప్రాసిక్యూటర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించాలని అథవాలే డిమాండ్ చేశారు. కాగా 24 ఏళ్ల తునీషా శర్మ సహ నటుడు షీజాన్ ఖాన్ మేకప్ రూమ్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం షీజాన్నుపోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment