
బెంగళూరు: బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రెండు ఇండిగో విమానాలు గాల్లో ఉండగా.. కాస్తలో ఒకదాంతో మరొకటి ఢీ కొట్టే ప్రమాదం తప్పింది. జనవరి 7వ తేదీనే ఈ ఘటన జరిగిందని ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ సీనియర్ అధికారులు బుధవారం వెల్లడించారు.
ఇండిగో విమానం 6ఈ455 (బెంగళూరు నుండి కోల్‌కతా), 6ఈ246 (బెంగళూరు నుండి భువనేశ్వర్) ఉదయం పూట వెళ్తున్న సమయంలో సుమారు 5 నిమిషాల వ్యవధిలో కెంపగౌడ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ రెండు విమానాలు గాల్లో అత్యంత దగ్గరా సమీపిస్తుండగా రాడార్లు హెచ్చరించాయి. దీంతో రెండు విమానాల పైలట్లు వెంటనే అప్రమత్తమై దూరంగా మళ్లించండంతో ఢీకొట్టే ముప్పు తప్పిందని తెలిపారు.
ఘటన జరిగినప్పుడు రెండు విమానాలు 3,000 అడుగుల ఎత్తులో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. బెంగళూరు-కోల్‌కతా విమానంలో 176 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది. బెంగళూరు-భువనేశ్వర్ విమానంలో 238 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది మొత్తం 426 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు వెల్లడించారు.
రెండు విమానాలు గాల్లో ప్రమాదకరంగా అత్యంత సమీపంగా కదులుతున్న సమయంలో అప్రోచ్ రాడార్ కంట్రోలర్ లోకేంద్ర సింగ్ గమనించి.. వెంటనే రెండు విమానాలకు సిగ్నల్ ద్వారా హెచ్చరికలు పంపారు. దీంతో రెండు విమానాలు గాల్లో ఢీకొనకుండా నివారించారని డీజీసీఏ ప్రాథమిక నివేదికలో పేర్కొంది.
అయితే ఈ విషయాన్ని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎక్కడా నివేదించలేదని తెలిపారు. దీనిపై డీజీసీఏ చీఫ్ అరుణ్ కుమార్ స్పందిస్తూ.. ఈ ఘటనపై ఏవియేషన్ రెగ్యులేటరీ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోందని పేర్కొన్నారు. దీనికి కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెండు విమానాలు బెంగళూరు విమానాశ్రయం టేకాఫ్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment