ఇంఫాల్: అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో విచారకర ఘటనలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇద్దరు మహిళలను నగ‍్నంగా ఊరేగింపు ఘటన జరిగిన రోజే మరో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. కాంగ్‌పోక్పి జిల్లాలో మరో ఇద్దరు యువతులపై అల్లరిమూకలు అత్యాచారం చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. కొనుంగ్ మమాంగ్ ప్రాంతంలో 21,24 ఏళ్ల బాధిత యువతులు కార‍్ల వాషింగ్ సెంటర్‌లో పనిచేస్తుండగా.. ఈ ఘటన జరిగింది. మహిళల నగ్నంగా ఊరేగింపు ఘటన జరిగిన ప్రాంతానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
కారు వాషింగ్ సెంటర్‌లో పనిచేస్తుండగా.. కొంత మంది మహిళలతో కూడిన అల్లరి మూకలు వారిపై దాడి చేశారు. బాధిత మహిళలను గదిలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేయాల్సిందిగా అల్లరి మూకల్లోని మహిళలే ప్రోత్సహించారని ప్రత్యక్ష సాక్షులు టైమ్స్ ఆఫ్ ఇండియా జరిపిన ఇంటర్య్వూలో తెలిపారు. గదిలోకి ఈడ్చుకెళ్లిన బాధిత మహిళల ఆర్తనాధాలు తమ చెవుల్లో ఇంకా మారుమోగుతున్నాయని, ఆ భయానక పరిస్థితుల గురించి వెల్లడించారు.
ఇదీ చదవండి: Manipur: మానవ మృగాల కోసం గాలింపు ముమ్మరం.. జనాలకు మణిపూర్ పోలీసుల విజ్ఞప్తి
అత్యాచార ఘటనల బాధితులు భయం కారణంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే.. చివరకు ఓ బాధిత యువతి తల్లి మే 16న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుదారు కూతురుతో సహా మరో యువతిని అత్యాచారం చేసి అతి దారుణంగా హత్య చేశారని ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు నమోదు చేశారు. ఇప్పటికీ ఆ బాధిత యువతులు మృతదేహాలు లభ్యం కాలేదు. అల్లరి మూకలు 100 నుంచి 200 మంది వరకు ఉంటారని పోలీసులు పేర్కొన్నారు.
ఈ కేసులో మణిపూర్ పోలీసులు ఈ కేసులో ఇప్పటివరకు ఎవ్వరిని అరెస్టు చేయలేదు. అయితే.. అల్లర్లలో జరిగిన హత్యలు, అత్యాచారాలు, దోపిడీలపై పోలీసులు దర్యాప్తు చేస్తున‍్నారు. జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. మణిపూర్‌లో మే3న అల్లర్లు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు 125 మంది మరణించారు. 40,000 కుపైగా మంది రాష్ట్రాన్ని విడిచి వెళ్లారు.
జాతుల మధ్య వైరంతో రెండునెలలుగా మణిపుర్ రాష్ట్రం భగ్గుమంటోంది. అప్పటి నుంచి జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనల్లో భాగంగానే మే 4న ఓ వర్గానికి చెందిన ఇద్దరు మహిళలపై కొందరు వ్యక్తులు క్రూరత్వానికి ఒడిగట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాజకీయ దుమారం రేపింది. సరిగ్గా అదే రోజు ప్రస్తుత ఘటన జరగడం సంచలనంగా మారింది.
ఇదీ చదవండి: మణిపూర్‌లో ఆరోజున జరిగింది ఇదే.. బాధితురాలు తల్లి ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment