నాగ్‌పూర్: దాదాపు అరవై ఐదేళ్ల నుంచి కొనసాగుతున్న సరిహద్దు సమస్యకు పుల్‌స్టాప్ పడాలని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన(యూబీటీ) అధినేత ఉద్దవ్ థాక్రే కోరుతున్నారు. కర్ణాటక ఆక్రమిత మహారాష్ట్ర(Karnataka Occupied Maharashtra)ను.. కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో ఆయన మాట్లాడుతూ..
ఇది కేవలం సరిహద్దు, భాషలకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు. మానవత్వానికి సంబంధించింది. మరాఠా మాట్లాడే ప్రజలు సరిహద్దు గ్రామాల్లో తరతరాల నుంచి జీవిస్తున్నారు. వాళ్ల దైనందిన జీవితం మరాఠీతో ముడిపడి ఉంది. సుప్రీం కోర్టులోనూ ఈ అంశం పెండింగ్‌లో ఉంది. అంతకంటేముందే కేంద్రం ఈ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలి. కేంద్రం చేతుల్లోనే ఈ సమస్యకు పరిష్కారం ఉంది అని అసెంబ్లీ సాక్షిగా ఉద్దవ్ థాక్రే కేంద్రాన్ని కోరారు.
రాష్ట్రాలకు సంరక్షకుడిగా వ్యవహరించాల్సిన కేంద్రం ఈ విషయంలో ఏం చేస్తోందని ఆయన నిలదీశారు. ఈ క్రమంలో.. కర్ణాటక ప్రభుత్వంతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వంపైనా ఆయన విమర్శలు గుప్పించారు. సీఎం షిండే ఈ వ్యవహారంలో ఒక్క మాటైనా మాట్లాడాలని నిలదీశారు.
బెలగావి మున్సిపల్ కార్పొరేషన్ మహారాష్ట్రలో విలీనం చేయాలనే తీర్మానాన్ని ఆమోదించినప్పుడు, కార్పొరేషన్‌పై చర్యలు తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా థాక్రే గుర్తు చేశారు. అదే విధంగా మహారాష్ట్రలోని కొన్ని గ్రామ పంచాయతీలు తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్ చేశాయి. ఈ గ్రామ పంచాయతీలపై చర్యలు తీసుకునే ధైర్యం షిండే ప్రభుత్వానికి లేదా? అని థాక్రే ప్రశ్నించారు. థాక్రే ప్రసంగించిన సమయంలో.. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విజిటర్స్ హాల్ నుంచి వీక్షించడం గమనార్హం.
ఈ సరిహద్దు సమస్య ఈనాటిది కాదు. భాషా పరంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత(1957) నుంచి నడుస్తోంది. మరాఠీ మాట్లాడే జనాభా ఎక్కువగా ఉండడంతో.. మునుపటి బొంబాయి ప్రెసిడెన్సీలో భాగమైన బెలగావి తమకే చెందుతుందని మహారాష్ట్ర వాదిస్తోంది. ప్రస్తుతం కర్ణాటకలో భాగమైన 800 కంటే ఎక్కువ మరాఠీ మాట్లాడే గ్రామాలు తమకే సొంతమని అంటోంది.
ఇక కర్ణాటక మాత్రం.. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా, 1967 మహాజన్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా సరిహద్దులను ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment