న్యూఢిల్లీ: కోర్టు ధిక్కరణ కేసులో క్షమాపణ కోరబోనన్న న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పునరాలోచించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. భేషరతుగా క్షమాపణ చెప్పడానికి ఈనెల 24 దాకా సమయం ఇస్తున్నట్లు తెలిపింది. ప్రశాంత్ భూషణ్ చేసిన కొన్ని ట్వీట్లు న్యాయవ్యవస్థను ధిక్కరించేవిగా ఉన్నాయని, ఆయనను దోషిగా తేలుస్తూ సుప్రీంకోర్టు బెంచ్ ఈనెల 14న తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
దీంట్లో భూషణ్‌కు గరిష్టంగా ఆరునెలల వరకు జైలుశిక్ష లేదా రెండు వేల రూపాయల జరిమానా పడొచ్చు. లేదా రెండు శిక్షలు కలిపి విధించొచ్చు. శిక్ష ఖరారుపై సుప్రీంకోర్టులో గురువారం ఆసక్తికరమైన వాదనలు నడిచాయి. ధిక్కరణ కేసులో శిక్ష ఖరారును మరో బెంచ్ చేపట్టాలని ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన బెంచ్ నిర్ద్వందంగా తిరస్కరించింది.
ధిక్కార పూరిత ప్రకటన, న్యాయవ్యవస్థను ధిక్కరిస్తూ చేసిన ట్వీట్లపై క్షమాపణలు చెప్పే విషయంపై నిర్ణయం తీసుకునేందుకు ప్రశాంత్ భూషణ్‌కు ఈనెల 24 దాకా గడువు ఇచ్చిం ది. ఇందుకు ప్రశాంత్ భూషణ్ స్పందిస్తూ తన న్యాయవాదులతో సంప్రదించిన తరువాత కోర్టు ఇచ్చిన సలహాపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
అంతకుమునుపు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ బెంచ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ‘ధిక్కరణ కేసులో ఇప్పటికే దోషిగా నిర్ధారించిన నేపథ్యంలో ప్రశాంత్ భూషణ్‌కు అదనంగా ఎలాంటి శిక్ష విధించవద్దని అభ్యర్థించారు. తన ట్వీట్లపై క్షమాపణలు చెప్పరాదన్న ప్రశాంత్ భూషణ్ నిర్ణయంపై పునరాలోచించకపోతే వేణుగోపాల్ అభ్యర్థనను పరిగణించలేమని బెంచ్ స్పష్టం చేసింది. ప్రశాంత్ భూషణ్ తన తప్పును తెలుసుకుంటే తామూ ఉదారంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసిన బెంచ్ తదుపరి విచారణను 25వ తేదీకి వాయిదా వేసింది.
శిక్ష ఖరారును ఆపడం కుదరదు
ధిక్కరణ కేసులో సమీక్ష కోసం వేయనున్న రివ్యూ పిటిషన్‌పై విచారణ పూర్తయ్యేవరకూ శిక్ష ఖరారు చేయకూడదనే ప్రశాంత్ భూషణ్ అభ్యర్థనను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయితే రివ్యూ పిటిషన్‌పై విచారణ పూర్తయ్యేంతవరకు శిక్ష అమలును నిలిపి ఉంచుతామని తెలిపింది. ఖరారు విచారణను ఇంకో బెంచ్‌కు బదిలీ చేయడం సంప్రదాయలకు విరుద్ధమవుతుందని, గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదని బెంచ్ స్పష్టం చేసింది.
ప్రతిదానికీ ఒక లక్ష్మణ రేఖ ఉంటుందని, భూషణ్ దాన్ని అతిక్రమించారని కోర్టు అభిప్రాయపడింది. త్వరలో తాను పదవీ విరమణ చేస్తున్న కారణంగా ఈ కేసులో వాయిదాలు కోరరాదని జస్టిస్ అరుణ్ మిశ్రా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ విలువలు కాపాడేందుకు సద్విమర్శకు తావు ఉండాలని, ఆ విలువలను కాపాడే ఉన్నత లక్ష్యంతోనే తాను ఆ ట్వీట్లు చేశానని ప్రశాంత్ వివరించారు. ‘‘దయ చూపాలని అడగను. ఉదాత్తంగా వ్యవహరించమనీ కోరను. ఈ కోర్టు ఏ శిక్ష విధించినా సంతోషంగా స్వీకరిస్తా’’అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment