బీజేపీ, విపక్షాల వాగ్యుద్ధం
బిçహార్, ఏపీలకు పకోడీ, జిలేబీ
మిగతా రాష్ట్రాలకు మొండిచేయి
రాజ్యసభలో విపక్ష నేత ఖర్గే
ఉభయ సభల్లో వాకౌట్ల పర్వం
న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయసభల్లో బుధవారం కేంద్ర బడ్జెట్‌పై అధికార, విపక్షాల తీవ్ర వాగ్యుద్ధం చోటుచేసుకుంది. సమాఖ్య స్ఫూర్తికి, పేదలకు బడ్జెట్ ఫక్తు వ్యతిరేకంగా ఉందంటూ విపక్షాలు దుయ్యబట్టాయి. అధికార ఎన్డీఏ కూటమి భాగస్వాములను ప్రసన్నం చేసుకోవడానికే మోదీ సర్కారు పరిమితమైందని ఆరోపించాయి. రాజ్యసభ, లోక్‌సభ సమావేశం కాగానే బడ్జెట్ కేటాయింపులపై చర్చకు అవకాశం ఇవ్వాలంటూ పట్టుబట్టాయి. సభాపతులు అందుకు నిరాకరించడంతో ఉభయ సభల నుంచీ కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ వాకౌట్ చేశాయి.
కుర్చీ కాపాడుకునే బడ్జెట్!
‘‘బడ్జెట్లో బిహార్, ఆంధ్రప్రదేశ్‌లకు పకోడా, జిలేబీ దక్కాయి. మిగతా రాష్ట్రాలన్నింటికీ మోదీ మొండిచేయి చూపారు’’ అంటూ రాజ్యసభలోవిపక్ష నేత ఖర్గే దుయ్యబట్టారు. ఇతర కార్యకలాపాలను పక్కన పెట్టి ముందుగా బడ్జెట్‌పై చర్చ చేపట్టాలంటూ నోటీసులిచ్చారు. వాటన్నింటినీ చైర్మన్ తిరస్కరించడంపై విపక్ష సభ్యులంతా మండిపడ్డారు.
‘కేవలం ఐదు రాష్ట్రాలకే పరిమితమైన బడ్జెట్’, ‘కురీ్చని కాపాడుకునే బడ్జెట్’ అంటూ నినాదాలకు దిగారు. బడ్జెట్ కేటాయింపులు విపక్షపూరితమంటూ విపక్ష ఎంపీలు బుధవారం ఉదయం లోక్‌సభ ప్రవేశద్వారం వద్ద బైఠాయించి నిరసనకు దిగారు. ఈ అంశాన్నే ముందు చర్చకు చేపట్టాలంటూ సభలో పదేపదే డిమాండ్ చేశారు. వారి తీరుపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహించారు. బైఠాయించి ఎవరినీ లోనికి రానీయకపోవడం ఏం పద్ధతని ప్రశ్నించారు.
బీజేపీ ఎంపీ బి.మహతాబ్ బడ్జెట్‌పై చర్చ ప్రారంభించారు. నయా మధ్యతరగతిని సాధికారతకు బడ్జెట్ పెద్దపీట వేసిందన్న ఆయన వ్యాఖ్యలను కాంగ్రెస్ సభ్యురాలు కుమారి సెల్జా తీవ్రంగా ఆక్షేపించారు. కేంద్ర బడ్జెట్ ఎవరి కోసమో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. ‘ఇది వికసిత్ బడ్జెట్ కాదు, విచలిత్ బడ్జెట్’ అంటూ ఎద్దేవా చేశారు. తుమ్మితే ఊడేలా ఉన్న సంకీర్ణానికి మోదీ సారథ్యం వహిస్తున్నారంటూ తృణమూల్ నేత అభిషేక్ బెనర్జీ ఎద్దేవా చేశారు.
అందుకే కీలక ఎన్డీఏ భాగస్వాములను తృప్తి పరిచేందుకు బిహార్, ఏపీలకే బడ్జెట్లో పెద్దపీట వేశారని ఆరోపించారు. బెనర్జీ వ్యాఖ్యలు తృణమూల్ పాలిత పశి్చమబెంగాల్‌కే వర్తిస్తాయంటూ కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తిప్పికొట్టారు. దయానిధి మారన్ (డీఎంకే), సుప్రియా సులే తదితరులు బడ్జెట్‌పై విమర్శలు గుప్పించారు. విపక్ష సభ్యులనుద్దేశించి బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ చేసిన విమర్శలు వివాదమయ్యాయి. దాంతో వాటిని రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ చెప్పారు.
పార్లమెంట్ ప్రాంగణంలో విపక్షాల నిరసన
కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపు తీరుపై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష పాలిత రాష్ట్రాలకు బడ్జెట్‌లో మొండిచేయి చూపారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరిపై బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన తెలిపారు. దేశ సమాఖ్య వ్యవస్థ పవిత్రతపై మోదీ ప్రభుత్వం దాడి చేసిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. విపక్ష పాలిత రాష్ట్రాలపై వివక్ష చూపించారని, ఇదెక్కడి న్యాయమని నిలదీశారు. కాంగ్రెస్ ఎంపీలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు అఖిలేష్ యాదవ్ సహా డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీల ఎంపీలు నిరసనలో పాల్గొన్నారు.
నిర్మల మాతాజీ!
ఖర్గే సంబోధన కూతురన్న ధన్‌ఖడ్
రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సంబోధనల సంవాదం జరిగింది. చాలా రాష్ట్రాలకు బడ్జెట్లో అన్యాయం జరిగిందని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతుండగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వివరణ ఇచ్చేందుకు చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ అవకాశమిచ్చారు. దాంతో ఖర్గే ఆగ్రహించారు. నిర్మలను ఉద్దేశించి, ‘‘మాతాజీ! మీరు మాట్లాడటంలో ఎక్స్‌పర్ట్ అని నాకు తెలుసు. కానీ ముందుగా దయచేసి నన్ను పూర్తి చేయనివ్వండి’’ అన్నారు. మాతాజీ సంబోధనపై చైర్మన్ అభ్యంతరం తెలిపారు. ‘‘ఆర్థిక మంత్రికి 64 ఏళ్లు. మీకు 82. ఆమె మీకు మాతాజీ కాదు, కూతురి వంటిది’’ అన్నారు. అనంతరం ఖర్గే చర్చను కొనసాగిస్తూ నిర్మల కర్నాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైనందున బడ్జెట్లో ఆ రాష్ట్రానికి ఎంతో ఇస్తారనుకుంటే అసలేమీ ఇవ్వలేదంటూ ఎత్తిపొడిచారు.
Comments
Please login to add a commentAdd a comment