న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ విస్తరణ వార్తలు జోరందుకుంటున్న వేళ కీలక భేటీకి పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్రమోదీ. ఆయన అధ్యక్షతన కేంద్ర కేబినెట్ జూలై 3న సమావేశం కానుంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో కొత్తగా నిర్మించిన కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 3న కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్‌లో ఉన్న కేంద్ర మంత్రులు, సహాయ, స్వతంత్ర మంత్రులంతా ఈ భేటీకి హాజరవుతారు. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గురించి ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
కాగా, జూలై మూడో వారంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానుండగా.. కొన్ని రోజుల ముందు మంత్రి మండలి సమావేశం జరగనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక జూన్ 28న మోదీ నేతృత్వంలో బీజేపీ ఆగ్రనేతలు సమావేశమైన సంగతి తెలిసిందే. కేంద్ర హోంమత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర నేతలతో ప్రధాని మోదీ బుధవారం అర్థరాత్రి వరకు చర్చలు జరిపారు.
ఈ ఏడాది చివర్లో జరగనున్న కీలకమైన అసెంబ్లీ ఎన్నికలతోపాటు (రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరం), వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ సన్నద్ధత గురించి ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. అదే విధంగా ప్రభుత్వంలో, రాష్ట్ర స్థాయిలో పార్టీలో సంస్థాగత మార్పుల గురించి కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇక బుధవారం జరిగిన సమావేశంలోనే కేబినెట్‌లో మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇది జరిగిన మరుసటి రోజే కేబినెట్ భేటీ ప్రకటన వెలువడింది.
చదవండి: ఉత్తరాదిని వణికిస్తున్న భారీ వర్షాలు.. పలు రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్!
Comments
Please login to add a commentAdd a comment