మృతి చెందిన జవాన్లకు నివాళులర్పిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: బీజాపూర్ ఘటనను కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా క్షేత్రస్థాయికి వెళ్లి మావోయిస్టులను హెచ్చరించారు. ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో 23 మంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. బలగాల్లో ఆత్మ స్థైర్యం పెంచేందుకు అమిత్‌షా సోమవారం జగదల్‌పూర్, బీజాపూర్ జిల్లాల్లో పర్యటించారు. ఉదయం 10 గంటలకు జగదల్‌పూర్ వచ్చిన అమిత్‌షా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు వెళ్లి 10.45 గంటలకు అమర జవాన్లకు నివాళులర్పించారు. 11.20 గంటలకు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్, సీఆర్‌పీఎఫ్ డీజీ, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో కలసి ఘటనపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
మధ్యాహ్నం ఒంటిగంటకు బీజాపూర్ జిల్లా బాసగూడ సీఆర్‌పీఎఫ్ క్యాంపునకు వెళ్లి సీఆర్‌పీఎఫ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పోలీసులతో మాట్లాడారు. రాయ్‌పూర్‌లో చికిత్స పొందుతున్న జవాన్లను సాయంత్రం 3.30 గంటలకు పరామర్శించారు. అనంతరం నేరుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఘటనపై జగదల్‌పూర్‌లో కేంద్రహోంమంత్రి అమిత్ షాతో మాట్లాడుతూ మావోయిస్టులపై పోరులో జవాన్లు చూపిన ధైర్యసాహసాలు మరువలేనివని, వారి అమరత్వాన్ని దేశం ఎన్నటికీ మరవదని కొనియాడారు. ‘ఆపరేషన్ ప్రహార్–3’చేపట్టి మావోయిస్టులను సమూలంగా ఏరివేస్తామన్నారు.
బలగాలను, బెటాలియన్లను మరింత పెంచి, పోరును ఉధృతం చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. మావోలపై ప్రతీకారం తీర్చుకుంటామని, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ దండకారణ్య బెటాలియన్ కమాండర్ మడివి హిడ్మాతోపాటు మరో ఎనిమిది మంది మావో యిస్టు పార్టీ అగ్రనేతలను మట్టుబెడతామన్నా రు. హోంమంత్రి ఏకంగా క్షేత్రస్థాయికి వచ్చి హెచ్చరిక చేయడంతో కేంద్రం ఈ ఘటనను ఎంత సీరియస్‌గా తీసుకుందో తెలుస్తోంది.
సరిహద్దు తెలంగాణలో మరింత కూంబింగ్..
గోదావరి పరీవాహక తెలంగాణ జిల్లాల్లో ప్రస్తు తం అలజడి నెలకొంది. బీజాపూర్ ఘటన నేపథ్యంలో తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలు, యాక్షన్ టీముల కదలికలపై పోలీసులు మరింత పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో గత జూలైలో కమిటీలు వేసుకున్న మావోయిస్టు పార్టీ రిక్రూట్‌మెంట్లు కూడా చేస్తోంది. మరోవైపు సింగరేణి కార్మిక సమాఖ్యను, రైతు విభాగాన్ని, జననాట్య మండలిని పునరుద్ధరించేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది.
వెనక్కి వెళ్లకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదు
బీజాపూర్, జగదల్‌పూర్ జిల్లాల్లో ఒకవైపు అమిత్‌షా పర్యటన సాగుతుండగానే మావోయిస్టు పార్టీ సౌత్ సబ్ జోనల్ బ్యూరో పేరిట లేఖ విడుదల చేసింది. భారతదేశ దోపిడీ వర్గం రక్షణలో పనిచేసే భద్రతాదళాల్లో ఉద్యోగాలు చేయడం మానేయాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 2020 నుంచి దోపిడీదారుల దాడులు తీవ్రమయ్యాయని, ఈ క్రమంలో దండకారణ్యంలో ప్రజలు నిరసన వ్యక్తం చేస్తుండటంతోపాటు అనేక త్యాగాలు చేస్తున్నారని అన్నారు. పీఎల్‌జీఏ నిరంతర పోరాటం చేస్తోందన్నారు. పోలీసులు నకిలీ ఎన్‌కౌంటర్లు చేస్తుండడంతోపాటు ప్రజలను, మహిళలను హింసిస్తున్నారని ఆరోపించారు.
కిసాన్ ఆందోళనలో 300 మంది రైతులు త్యాగాలు చేశారన్నారు. జై జవాన్–జై కిసాన్ అంటూ పాలకవర్గాలు ఇచ్చే నినాదం మోసపూరితమైనదని, గత 75 ఏళ్లలో ఇది నిరూపితమైందని పేర్కొన్నారు. విద్యార్థులు, రైతులు, కూలీలు, గిరిజనులు, నిరుద్యోగులు ఉద్యమించాలని లేఖలో కోరారు. ఈ నెల 26న భారత్‌బంద్ నిర్వహించాలని పిలుపునిచ్చారు.
చదవండి: మా అధీనంలోనే కోబ్రా కమాండో
Comments
Please login to add a commentAdd a comment