ఇండోర్: మనదేశంలో విభిన్న సంప్రదాయాలు కనిపిస్తాయి. వీటిలో కొన్ని ఎంతో వింతగా అనిపిస్తాయి. ఇటువంటి వింత సంప్రదాయం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కొనసాగుతోంది. దీపావళి మర్నాటి రోజున ఇండోర్ జిల్లా గౌతమ్‌పురాలో సంప్రదాయం పేరుతో కళంగి- తుర్రా సమూహాల మధ్య హింగోట్ యుద్ధం శుక్రవారం జరిగింది. సుమారు గంటన్నర పాటు సాగిన ఈ యుద్ధాన్ని వీక్షించేందుకు ఇండోర్, ఉజ్జయిని, ధార్, దేవాస్ సహా సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. రాష్ట్రంలో దీపావళి మర్నాడు ఈ తరహా యుద్ధం జరిగే ఏకైక ప్రదేశం గౌతమ్‌పురా. ఈ యుద్ధంలో 15 మందికి పైగా యోధులు మరియు ప్రేక్షకులు గాయపడ్డారు.
ఇండోర్ హింగోట్ యుద్ధం చూసేందుకు వచ్చే ప్రేక్షకుల కోసం స్టేడియం ప్రాంతంలో 25 అడుగుల ఎత్తులో నెట్‌ను ఏర్పాటు చేశారు. యుద్ధభూమిలో భద్రతను దృష్టిలో ఉంచుకుని, 300 మందికి పైగా పోలీసులను మోహరించారు. దీంతో పాటు పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.
గౌతమ్‌పురాను గౌతమ ఋషి నగరంగా పరిగణిస్తారు. ఏళ్ల తరబడి సాగుతున్న హింగోట్ యుద్ధం ఎలాంటి ప్రచారం లేకుండానే ఉత్కంఠభరితంగా సాగుతుంటుంది. రాష్ట్రంలోని పలు నగరాల నుంచి వేలాది మంది ప్రేక్షకులు హింగోట్ యుద్ధాన్ని వీక్షించేందుకు తరలివస్తుంటారు. ఈ సారి ఈ యుద్ధాన్ని చూసేందుకు వచ్చేవారితో మైదానం మొత్తం నిండిపోయింది. హింగోట్ యుద్ధంలో ముందుగా ఇరువర్గాల యోధులు డప్పుల మోతతో ఊరేగింపుగా వచ్చారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తలపై శిరస్త్రాణం, చేతుల్లో కవచాలు, నిప్పుల బాణాలు భుజాలకు తగిలించుకుని యోధులు మైదానంలోకి రావడంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రారంభంలో 50 నుండి 60 మంది యోధులు ముఖాముఖి తలపడ్డారు. సుమారు గంటపాటు జరిగిన ఈ యుద్ధం రాత్రి 7.30 గంటలకు ముగిసింది.
ఇది కూడా చదవండి: 1,101 మంది మహిళలు.. ఒకే రంగు చీరతో కాళీ పూజలు
Comments
Please login to add a commentAdd a comment