బెంగుళూరు: కర్ణాటక అసెంబ్లీలో బడ్జెట్ సెషన్ నడుస్తుండగా ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ 70 ఏళ్ల సామాన్య వృద్ధుడు నేరుగా అసెంబ్లీలోకి చొరబడి ఏకంగా ఎమ్మెల్యే సీటులోనే కూర్చున్నాడు. సభలోని ఓ ఎమ్మెల్యే అతడిని అనుమానించి భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేయడంతో వారు ఆ పెద్దమనిషిని అదుపులోకి తీసుకున్నారు.
కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని దాటుకుని సామాన్యుడు అసెంబ్లీలోకి చొరబడటంతో అక్కడి భద్రతా వ్యవస్థపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా ప్రయోజనాల నిమిత్తం చట్టాలను తయారు చేసే చట్టసభలను దేవాలయాలుగా పరిగణిస్తూ ఉంటాం. ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులకు మాత్రమే అందులో అడుగుపెట్టే అర్హత ఉంటుంది. అటువంటి చోటుకి సామాన్యులు వెళ్లడమంటే మాటలు కాదు.
అలాంటిది అక్కడి భద్రతా వలయాన్ని చేధించుకుని అసెంబ్లీ లోపలికి చొరబడటమే కాకుండా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని దర్జాగా బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్నాడు ఓ ఆగంతకుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మొలకాల్మోర్ నియోజకవర్గంలోని చిత్రదుర్గ జిల్లాకు చెందిన 70 ఏళ్ల తిప్పేరుద్రప్ప అలియాస్ కరియప్ప మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అసెంబ్లీకి వచ్చి అక్కడి సెక్యూరిటీ వారికి తనని తాను ఒక ఎమ్మెల్యేగా పరిచయం చేసుకుని లోపలికి ఎంటరయ్యాడన్నారు.
అసెంబ్లీ లోపల దేవదుర్గ జేడీఎస్ ఎమ్మెల్యే కరియమ్మ సీటులో కూర్చుని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బడ్జెట్ ప్రకటిస్తుండగా 15 నిముషాల పాటు బడ్జెట్ సమావేశాలను తిలకించాడని, పక్కన ఉన్న మరో జేడీఎస్ ఎమ్మెల్యేకి అతడిపై అనుమానం రావడంతో అక్కడి సెక్యూరిటీకి ఫిర్యాదు చేయగా వారు అతడిని అదుపులోకి తీసుకుని కస్టడీకి తరలించారని, బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనాలన్న ఆసక్తితోనే అతడు అసెంబ్లీలోకి చొరబడినట్లు తెలిపారు పోలీసులు.
ఇది కూడా చదవండి: మెట్రోలో యువతుల పోల్ డ్యాన్సింగ్.. వీడియో వైరల్..
Comments
Please login to add a commentAdd a comment