దేశ వ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్ పోస్టుల భర్తీకి నిర్వహించిన సివిల్ సర్వీసెస్ 2022 తుది ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. సివిల్స్ ఫలితాల్లో గ్రేటర్ నోయిడా ప్రాంతానికి చెందిన ఇషితా కిషోర్ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్‌తో మెరిశారు. గరిమ లోహియా, ఎన్ ఉమా హారతి. స్మృతి మిశ్రా వరుసగా రెండు, మూడు, నాలుగు ర్యాంకులు సాధించారు. గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా అమ్మాయిలే టాప్ ర్యాంకర్లుగా నిలిచారు. తొలి 25 ర్యాంకర్లలో 14 మంది మహిళలే ఉండటం విశేషం.
కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకొని..
ఇషితా కిషోర్ ఎయిర్‌ఫోర్స్ బాల్ భారతి పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఇంటర్‌లో కామర్స్ విభాగంతో 97 శాతంతో ఉత్తీర్ణత సాధించింది. 2017లో ఢిల్లీ యూనివర్సిటీ శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ కళాశాల నుంచి ఎకనామిక్స్ హానర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. డిగ్రీ తరువాత లండన్‌లో ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనే సంస్థలో రిస్క్ అనలిస్ట్‌గా చేరారు. కానీ ఆ ఉద్యోగం సంతృప్తినివ్వలేదు. రెండేళ్ల తర్వాత యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌కు ప్రీపెర్ అయ్యేందుకు 2019లో తన ఉద్యోగాన్ని వదిలేసింది.
చదవండి: ‘సివిల్స్’లో సత్తా చాటిన తెలుగు తేజాలు..
మూడో ప్రయత్నంలో ఫస్ట్ ర్యాంక్
సివిల్స్ మీద ఆసక్తితో చేసిన తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్ పరీక్షలో ఇషితా ఉత్తీర్ణత సాధించలేదు. అయినా నిరాశ పడకుండా రెండోసారి ప్రయత్నించారు. ఈసారి కూడా ప్రిలిమ్స్ దాటలేకపోయారు. గతేడాది మూడోసారి సివిల్స్ పరీక్ష రాశారు. అయితే ఈసారి ప్రిలిమ్స్ గట్టెక్కడంతో తనపై తనకు నమ్మకం పెరిగింది. దీంతో మరింత కష్టపడి చదివి మెయిన్స్, ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు.
సైనిక కుటుంబ నేపథ్యం
26 ఏళ్ల ఇషితా తండ్రి సంజయ్ కిషోర్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అధికారిగా పనిచేస్తున్నారు. సైనిక నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రావడంతో దేశానికి సేవ చేయాలనే ఆలోచన ఆమెలో బలంగా నాటుకుంది. ‘నా కుటుంబాన్ని చూసిన ప్రతిసారీ ఈ దేశం కోసం ఏదైనా చేయాలనే తపన నాలో ఎప్పుడూ ఉంటుంది. నేను పెరిగిన వాతావరణం అలాంటింది. అందుకే సివిల్స్ సర్వీసెస్‌లో చేరాను’ అని ఇషితా తెలిపారు..
కాగా ఇషితా తల్లి ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె సోదరుడు న్యాయవాది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌ను ఎంచుకున్న కిషోర్ ఉత్తర ప్రదేశ్ కేడర్‌ను తొలి ప్రాధాన్యతగా సెలెక్ట్ చేసుకుంది. ఇషితా జాతీయ స్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారిణి కూడా. ఆమె పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్‌ను తన ఆప్షనల్ సబ్జెక్ట్‌గా ఎంచుకొని సివిల్స్‌కు అర్హత సాధించారు.
చదవండి: UPSC సివిల్ సర్వీసెస్ తుది ఫలితాల్లో విజేతలు వీళ్లే
దేశానికి సేవ చేయాలని..
తన విజయంపై ఇషిత మాట్లాడుతూ.. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక కావడం చాలా పెద్ద విషయమని, మొదటి ర్యాంక్ సాధించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. దేశానికి సేవ చేయడానికి తనకు అవకాశం లభించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. దీని ద్వారా దేశానికి సేవ చేయాలన్న తన కల నిజమైందని పేర్కొన్నారు. మహిళా సాధికారికత, ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తానని చెప్పింది.
యూపీఎస్సీ పరీక్షలో ఈసారి తప్పకుండా ఉత్తీర్ణత సాధిస్తానని నమ్మకం ఉంది కానీ ఏకంగా ఫస్ట్ ర్యాంక్ వస్తుందని ఊహించలేకపోయానని తెలిపింది. సివిల్స్ కొట్టేందుకు ఎంతో కష్టపడ్డానని, రోజుకు కనీసం 8 నుంచి 9 గంటలు చదువుకునేదాన్ని అని తెలిపింది. యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో సానుకూల మనస్తత్వం, ఆత్మవిశ్వాసం ఎంతో ముఖ్యమని పేర్కొంది. ఈ అత్యుత్తమ విజయం వెనక, తనను నిరంతరం ప్రోత్సహించిన తల్లిదండ్రులు, స్నేహితులు.. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది.
#WATCH | Ishita Kishore, who has secured 1st rank in UPSC 2022 exam, says, "One has to be disciplined and sincere to be able to achieve this." pic.twitter.com/YKziDcuZJz
— ANI (@ANI) May 23, 2023
మెరిసిన తెలుగు తేజం
2022 సివిల్స్ ఫలితాల్లో తెలుగు తేజం ఉమా హారతి మెరిశారు. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లాకు చెందిన ఉమా హారతి జాతీయస్థాయిలో మూడో ర్యాంక్ సాధించారు. ఉమా హారతి తండ్రి వెంకటేశ్వర్లు నారాయణపేట ఎస్పీగా పనిచేస్తున్నారు. తాను ఐదో ప్రయత్నంలో ఈ విజయం సాధించినట్లు తెలిపారు. కుటుంబ ప్రోత్సాహంతోనే ఉత్తమ్ ర్యాంకు సాధించానని వెల్లడించారు. విధుల్లో చేరిన తర్వాత విద్యా, వైద్యం, మహిళ సాధికారత కోసం కృషి చేస్తానని తెలిపారు
సివిల్ సర్వీసెస్ 2022 తుది ఫలితాల్లో మొత్తం 933 మంది అభ్యర్థులను యూపీఎస్‌సీ ఎంపిక చేంది. . వీరిలో IAS సర్వీసెస్‌కు 180 మందిని ఎంపిక చేసింది. అలాగే IFSకు 38 మందిని, IPSకు 200 మంది ఉన్నారు. ఇక సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్-Aకు 473 మంది, గ్రూప్-Bకి 131 మందిని ఎంపిక చేసింది. గ్రూప్-B కలుపుకుంటే ఎంపిక అయిన అభ్యర్థుల సంఖ్య 1022 అయింది. ఇందులో జనరల్ కోటాలో 345 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 99, ఓబీసీ నుంచి 263, ఎస్సీ నుంచి 154, ఎస్టీ విభాగం నుంచి 72 మంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment