న్యూఢిల్లీ: భారత్‌లో 2023లో 10 లక్షల నాన్ ఇమిగ్రంట్ వీసాలను జారీ చేయాలన్న లక్ష్యాన్ని అధిగమించినట్లు అమెరికా ఎంబసీ తెలిపింది. ఇదే ఒరవడిని ఇకపైనా కొనసాగిస్తామని ప్రకటించింది. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లో తమ కుమారుడి స్నాతకోత్సవానికి హాజరవుతున్న పునీత్ దర్గన్, డాక్టర్ రంజుసింగ్ దంపతులకు 10 లక్షలవ వీసాను గురువారం భారత్‌లో తమ రాయబారి గార్సెట్టి అందజేశారని వెల్లడించింది.
లేడీ హార్డింజ్ కాలేజీలో సీనియర్ కన్సల్టెంట్ అయిన డాక్టర్ రంజు సింగ్‌కు 10 లక్షలవ వీసా, ఆమె భర్త పునీత్ దర్గన్‌కు ఆ తర్వాతి వీసా జారీ అయ్యాయని వివరించింది. ప్రపంచదేశాల నుంచి అమెరికాకు అందే మొత్తం వీసా దరఖాస్తుల్లో 10 శాతం భారత్ నుంచే అని ఎంబసీ ప్రకటించింది. మొత్తం విద్యార్థి వీసాల్లో 20 శాతం, హెచ్ అండ్ ఎల్ కేటగిరీ(ఉద్యోగాలు)లో 65 శాతం భారతీయులవేనని కూడా తెలిపింది.
2019 కోవిడ్‌కి ముందుకంటే ఈసారి 20 శాతం ఎక్కువగా వీసాలను జారీ చేసినట్లు పేర్కొంది. గత ఏడాది 12 లక్షల మంది భారతీయులు అమెరికాను సందర్శించారని పేర్కొంది. కోవిడ్ కారణంగా వీసాల జారీ ప్రక్రియ నిలిచిపోవడంతో తలెత్తిన డిమాండ్‌ను అధిగమించేందుకు చెన్నై కాన్సులేట్‌లో అదనపు సిబ్బంది నియామకం, హైదరాబాద్‌లో విశాలమైన భవనంలో నూతన కాన్సులేట్‌ను ఏర్పాటు చేయడం వంటి చర్యల ద్వారా వీసాల జారీ ప్రక్రియను వేగవంతం చేయగలిగామని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment