భిన్నత్వమే మన బలం | US Secretary of State Antony Blinken meets PM Narendra Modi | Sakshi
Sakshi News home page

భిన్నత్వమే మన బలం

Published Thu, Jul 29 2021 4:27 AM | Last Updated on Thu, Jul 29 2021 7:10 AM

US Secretary of State Antony Blinken meets PM Narendra Modi - Sakshi

మోదీతో బ్లింకెన్‌ భేటీ దృశ్యం

న్యూఢిల్లీ: భిన్నత్వమే భారత్, అమెరికా సమాజాల బలమని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ అన్నారు. ఇరు దేశాల చర్యలే 21వ శతాబ్దాన్ని నిర్దేశించబోతున్నాయని చెప్పారు. భారత్‌తో మైత్రి బలోపేతానికి అమెరికా అత్యంత ప్రాధాన్యం ఇవ్వడానికి ఇదే కారణమని పేర్కొన్నారు. భారత్, అమెరికాలు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలని, భిన్నత్వమే ఇరు దేశాల బలమని ఉద్ఘాటించారు. ఆయన బుధవారం ఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశమయ్యారు.

అఫ్గానిస్తాన్‌లో తాజా పరిస్థితి, ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో పరిణామాలు, కోవిడ్‌పై పోరాటం తదితర కీలక అంశాలపై ఇరువురూ చర్చించుకున్నారు. పలు అంశాలపై బ్లింకెన్‌తో ఫలవంతమైన చర్చలు జరిగాయని జైశంకర్‌ ట్వీట్‌ చేశారు. శాంతియుత, సుస్థిర అఫ్గాన్‌ను భారత్, అమెరికా కాంక్షిస్తున్నాయని బ్లింకెన్‌ వ్యాఖ్యానించారు.  బ్లింకెన్‌ భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌తోనూ సంప్రదింపులు జరిపారు. భద్రత, రక్షణ, ఆర్థికం, సాంకేతిక రంగాలకు సంబంధించిన అంశాలపై ఇరువురూ మాట్లాడుకున్నట్లు సమాచారం.

దలైలామా ప్రతినిధి డాంగ్‌చుంగ్‌తో భేటీ
టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు దలైలామా తరఫు సీనియర్‌ ప్రతినిధి గాడప్‌ డాంగ్‌చుంగ్‌తో బ్లింకెన్‌ సమావేశమయ్యారు. తద్వారా టిబెట్‌కు అమెరికా మద్దతు కొనసాగిస్తోందనే సందేశాన్నిచ్చారు. పౌర సమాజం సభ్యులతో బ్లింకెన్‌ జరిపిన చర్చల్లో టిబెట్‌ ప్రతినిధి గెషీ డోర్జీ డామ్‌దుల్‌ పాల్గొన్నారు.

మరో 25 మిలియన్‌ డాలర్లు
భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్‌ విజయవంతానికి సహకరిస్తామంటూ బ్లింకెన్‌ ట్వీట్‌ చేశారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి అమెరికా ప్రభుత్వం నుంచి యూఎస్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌(యూఎస్‌ఎయిడ్‌) ద్వారా మరో 25 మిలియన్‌ డాలర్ల సాయం అందించనున్నట్లు తెలిపారు. ఆగస్టు మాసాంతానికికల్లా ఇండియాలో 68,000 విద్యా వీసా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కరోనా ప్రారంభ దశలో ఇండియా సహకారం మర్చిపోలేనిదని వ్యాఖ్యానించారు.

క్రియాశీలకంగా పౌర సమాజాలు
దేశంలో తమ గళం వినిపించే అర్హత ప్రతి ఒక్కరికీ ఉందని బ్లింకెన్‌ ఉద్ఘాటించారు. వారు ఎవరన్న దానితో సంబంధం లేకుండా తగిన గౌరవం ఇవ్వాలన్నారు. భారతీయులు, అమెరికన్లు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, మత స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇస్తారని గుర్తుచేశారు. ఏడుగురు పౌర సమాజం సభ్యులతో సమావేశం నిర్వహించారు. ప్రజాస్వామ్య విలువలకు భారత్, అమెరికా కట్టుబడి ఉన్నాయని గుర్తుచేశారు. ద్వైపాక్షిక సంబంధాలకు ఇదే కీలక ఆధారమని వెల్లడించారు. పౌర సమాజాలు క్రియాశీలకంగా పనిచేస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ విజయవంతమవుతుందని బ్లింకెన్‌ అన్నారు.

బైడెన్‌ అంకితభావం భేష్‌: మోదీ
భారత్‌–అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే విషయంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ప్రదర్శిస్తున్న అంకితభావం, పట్టుదల అభినందనీయమని మోదీ పేర్కొన్నారు. బ్లింకెన్‌తో మోదీ భేటీ అయ్యారు. ‘బ్లింకెన్‌తో భేటీ ఆనందంగా ఉంది. భారత్‌–అమెరికా సంబంధ బాంధవ్యాలను, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా బైడెన్‌ చూపుతున్న అంకితభావాన్ని స్వాగతిస్తున్నాం. ఇరు దేశాల నడుమ ప్రజాస్వామ్య విలువలను పంచుకోవడానికే కాదు అంతర్జాతీయంగానూ మన వ్యూహాత్మక భాగస్వామ్యం కీలకం’అని మోదీ ట్వీట్‌ చేశారు. అమెరికాలో ఉంటున్న భారతీయులు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాను బలోపేతం చేసే విషయంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement