ది కేరళ స్టోరీ వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు.. విడుదలకు ముందే రాజకీయ రంగు పులుముకున్న ఈ వివాదం.. రోజులు గడుస్తున్న కొద్దీ తీవ్రతరమవుతోంది. వివిధ పార్టీలు. ప్రభుత్వాల మధ్య చిచ్చు రాజేస్తోంది. ఈ సినిమాను కేరళ ప్రభుత్వం సహా కాంగ్రెస్, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేరళను కించపరిచేలా, ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా రూపొందించారంటూ నిరసనలు వ్యక్తంచేస్తున్నాయి.
ఇప్పటికే రాష్ట్రంలో సినిమాను విడుదల చేస్తే అల్లర్లు జరిగే ప్రమాదం ఉందని తమిళనాడులోని మల్టిప్లెక్స్ థియేటర్లలో కేరళ స్టోరీ షోలను రద్దు చేశారు. మరోవైపు సమాజంలో అశాంతి. అలజడులను సృష్టించే అవకాశం ఉందని పశ్చిమ బెంగాల్‌లోని కేరళ స్టోరీని నిషేధిస్తున్నట్లు మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఎక్కడైనా ప్రదర్శిస్తున్నట్లు తేలితే కఠిన చర్యలుంటాయని చెప్పారు.
చదవండి: ‘ది కేరళ స్టోరీ’కి భారీ షాక్..
అయితే వివాదాస్పద ది కేరళ స్టోరి సినిమాకు బీజేపీ మాత్రం మద్దతు తెలుపుతోంది. బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రాల్లో కేరళ స్టోరీకి పన్ను మినహాయింపులు కూడా ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్ సినిమాకు టాక్స్ ఫ్రీ కల్పించగా... తాజాగా ఈ జాబితాలోకి ఉత్తర ప్రదేశ్ సైతం చేరింది. 'ది కేరళ స్టోరీ'ని ఉత్తరప్రదేశ్‌లో పన్ను రహితంగా ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. సీఎం తన క్యాబినెట్‌తో కలిసి ప్రత్యేక స్క్రీనింగ్‌లో సినిమాను వీక్షించే అవకాశం ఉంది.
ఇప్పటికే ప్రధాన మంత్రి మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సినిమాను చూశారు. ఉగ్రవాద ప్రమాదకర కుట్రను ఈ చిత్రం బహిర్గతం చేస్తుందని పేర్కొన్నారు. సినిమాను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించిన ఆయన.. ప్రతిపక్ష పార్టీ ఓటు బ్యాంకు కోసం ఉగ్రవాదాన్ని కప్పి ఉంచిందని మండిపడ్డారు. ది కేరళ స్టోరీ' ఏ రాష్ట్రం లేదా మతానికి సంబంధించినది కాదని జేపీ నడ్డా పేర్కొన్నారు.
కాగా సుదీప్తోసేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను విపుల్ అమృత్‌లాల్ నిర్మించారు. ఆదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలో నటించారు. కేరళలో తప్పిపోయిన 32 వేల మంది యువతలు ఏమయ్యారు, ఎక్కడున్నారనే ఇతివృత్తంతో తెరకెక్కించారు. కేరళలో తప్పిపోయిన నలుగురు అమ్మాయిలు ఉగ్రసంస్థ ఐఎస్ఐలో చేరి శిక్షణ పొంది పొంది తమ మాతృభూమిపైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టిన్నట్లు చూపించడంతో వివాదాలకు దారి తీసింది.
Comments
Please login to add a commentAdd a comment