డెహ్రాడూన్/నైనిటాల్: వరుణుడి ధాటికి దేవభూమి ఉత్తరాఖండ్ వణికిపోతోంది. రాష్ట్రంలోని కుమావూ రీజియన్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు ఇళ్లు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద ఎంతో మంది చిక్కుకుపోయి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్ష సంబంధ ఘటనల్లో మంగళవారం మరో 42 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో రెండ్రోజుల్లో మరణించిన వారి సంఖ్య ఏకంగా 47కు పెరిగింది. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని రాష్ట్ర యంత్రాంగం అంచనావేసింది. పలు చోట్ల కొండచరియలు విరిగి పడటంతో ప్రముఖ పర్యాటక ప్రాంతం నైనిటాల్‌కు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.
నైనిటాల్ జిల్లాలో ఇళ్లు కూలిన ఘటనల్లో ఏడుగురు మరణించారు. నైనిటాల్ రీజియన్‌లో మొత్తంగా 28 మంది చనిపోయారు. రాంనగర్–రాణిఖేత్ మార్గంలోని రిసార్ట్‌లో 100 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. నైనిటాల్ గుండా వెళ్లే రోడ్డు మార్గాలన్నీ కొండ చరియలు పడటంతో మూసుకుపోగా పునరుద్ధరణ చేశారు. రాష్ట్రంలో ప్రవహిస్తున్న నదులు ఉగ్రరూపం దాల్చాయి. గంగా, సరయు, గోరి, కాళి నదుల ప్రవాహ మట్టాలు ప్రమాదకర రీతిలో పెరిగాయి. ఉధమ్‌సింగ్ నగర్ జిల్లా, తదితర వరద ప్రభావిత ప్రాంతాల నుంచి దాదాపు 300 మందిని జాతీయ విపత్తు స్పందన దళం కాపాడింది.
సీఎంకు ప్రధాని ఫోన్
నైనిటాల్ జిల్లా, గర్వాల్ రీజియన్‌లో భారత వాయుసేనకు చెందిన హెలికాప్టర్లు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి మీడియాకు చెప్పారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే నిర్వహించారు. వాతావరణ పరిస్థితులు చక్కబడేదాకా ఛార్‌ధామ్ యాత్రికులు ఎక్కడి వారక్కడే ఉండిపోవాలని, యాత్ర కొనసాగించవద్దని సీఎం సూచించారు.
తాజా పరిస్థితిపై ప్రధాని మోదీ తనతో మాట్లాడారని, అత్యవసర సాయం అందించేందుకు సిద్దంగా ఉన్నారని ప్రధాని భరోసా ఇచ్చారని సీఎం చెప్పారు. ఛార్‌ధామ్ యాత్రికులకు సహాయక ఏర్పాట్లు చేయాలని ఛమోలీ, రుద్రప్రయాగ్ కలెక్టర్లను సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. గుజరాత్ యాత్రికులు ఇక్కడ చిక్కుకుపోవడంతో వారి సమాచారం కోసం గుజరాత్ సీఎం పటేల్.. ధామికి ఫోన్‌చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో నలుగురు మృతి
వర్ష సంబంధ ఘటనల్లో ఉత్తరప్రదేశ్‌లో నలుగురు మరణించారు. ఫతేపూర్‌లో ఇల్లు కూలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వర్షాల కారణంగా బిసాల్‌పూర్‌లో సోలార్ ప్యానెల్‌కు విద్యుత్ సరఫరా జరగడంతో మరో ఇద్దరు పౌరులు మరణించారు. మరోవైపు, బిహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడుల్లోనూ భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి.
కేరళలోని 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
కొచ్చి: ఎడతెరిపి లేని వర్షాల బారిన పడ్డ కేరళకు మరిన్ని వర్షాల ముప్పు పొంచి ఉంది. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ మంగళవారం హెచ్చరించింది. 24 గంటల వ్యవధిలో దాదాపు 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశమున్న సందర్భాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటిస్తారు. అక్టోబర్ 12 నుంచి చూస్తే వర్ష సంబంధ ఘటనల్లో కేరళలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు.
చాలా ఇళ్లు నేలమట్టమయ్యాయి. నిండటంతో 78 డ్యామ్‌ల నుంచి నీటిని వదులుతున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు కచ్చితంగా వెళ్లాలని, అందుకు నిరాకరిస్తే అరెస్ట్ చేసైనా తరలి స్తామని కేరళ మంత్రి కె.రాజన్ హెచ్చరించారు. కేరళలో ఇప్పటికే అక్టోబర్ నెలలో 135 శాతం అధిక వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment