అభ్యర్థుల లిస్టుతో ‘విజయ్‌’ పొలిటికల్ సునామీ! | Vijay Set To Launch TVK Party All Candidates List On March 29 Ahead Of Tamil Nadu And Puducherry Elections | Sakshi
Sakshi News home page

అభ్యర్థుల లిస్టుతో ‘విజయ్‌’ పొలిటికల్ సునామీ!

Mar 28 2026 9:55 AM | Updated on Mar 28 2026 12:22 PM

Vijay to introduce all candidates March 29

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించేందుకు ‘దళపతి’ పూర్తి స్థాయిలో విజయ్ సిద్ధమయ్యారు. తన రాజకీయ ప్రస్థానంలో అత్యంత కీలకమైన అడుగు వేస్తూ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను వెల్లడించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. మార్చి 29వ తేదీన తమిళనాడు, పుదుచ్చేరిలోని మొత్తం స్థానాల్లో బరిలో దిగనున్న అభ్యర్థులను విజయ్ స్వయంగా పరిచయం చేయనున్నారు.

తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని స్థాపించిన తర్వాత విజయ్ ఎదుర్కోబోతున్న తొలి ఎన్నికల సమరమిది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై పార్టీ లోతుగా కసరత్తు చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్. ఆనంద్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఆదివారం (మార్చి 29) చెన్నైలోని ఒక ప్రముఖ హోటల్‌లో రాష్ట్ర స్థాయి పార్టీ ప్రతినిధుల సమావేశం జరగనుంది. ఈ వేదిక నుంచే విజయ్ అభ్యర్థుల వివరాలను వెల్లడిస్తారు.

ఎన్నికల బరిలో 264 స్థానాలు
తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు, పుదుచ్చేరిలోని 30 నియోజకవర్గాల్లో టీవీకే ఒంటరిగానే పోటీ చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పుదుచ్చేరికి సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి కాగా, తమిళనాడు అభ్యర్థుల తుది జాబితాను ఆదివారం నాటి సమావేశంలో అధికారికంగా ప్రకటించనున్నారు.

ఏప్రిల్‌లో పోలింగ్ సందడి
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9వ తేదీన పోలింగ్ జరగనుంది. తమిళనాడులోని 234 స్థానాలకు ఏప్రిల్ 23న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ స్వల్ప సమయంలోనే అభ్యర్థులను ప్రకటించి, క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని విజయ్ భావిస్తున్నారు. ఆదివారం జరిగే ఈ సమావేశం టీవీకే ఎన్నికల వ్యూహాన్ని, ప్రచార పంథాను స్పష్టం చేయనుంది.

నటుడిగా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న విజయ్, ఇప్పుడు రాజకీయ నేతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇప్పటికే డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి దిగ్గజ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతుండగా, విజయ్ తన అభ్యర్థుల ప్రకటనతో రాజకీయ సమీకరణలను ఎలా మారుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళపతి అభిమానులు ఈ ప్రకటన కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మార్చి 29.. తమిళ రాజకీయాల్లో కొత్త మలుపునకు నాంది కాబోతున్నదని విశ్లేషకులు అంటున్నారు. 

ఇది కూడా చదవండి: West Bengal: 57 సీట్లు.. నరాలు తెగే ఉత్కంఠ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement