విశాఖ ఉక్కును విక్రయించవద్దు | Vijayasai Reddy meets Union Finance Minister Nirmala Sitharaman | Sakshi
Sakshi News home page

విశాఖ ఉక్కును విక్రయించవద్దు

Published Sat, Jul 24 2021 5:36 AM | Last Updated on Sat, Jul 24 2021 6:56 AM

Vijayasai Reddy meets Union Finance Minister Nirmala Sitharaman - Sakshi

నిర్మలా సీతారామన్‌కు వినతిపత్రం అందజేస్తున్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, విశాఖ నేతలు, కార్మిక నాయకులు

సాక్షి, న్యూఢిల్లీ/గాజువాక: విశాఖ ఉక్కు పరిశ్రమను విక్రయించాలన్న ఆలోచనను విరమించుకోవాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉక్కుకార్మిక సంఘాల ప్రతినిధులతో కలిసి ఆయన శుక్రవారం కేంద్రమంత్రితో సమావేశమయ్యారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించవద్దని వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఏళ్లతరబడి పోరాటం, 32 మంది ఆత్మబలిదానం తర్వాత 1966లో విశాఖ ఉక్కు ఏర్పాటై ఆంధ్రుల చిరకాల కల నెరవేరిందని చెప్పారు.

పరిశ్రమ ఆంధ్రుల మనోభావాలతో ముడిపడి ఉందని, ప్రభుత్వరంగ సంస్థల్లో నవరత్నగా నిలిచిన విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్‌కే ఆభరణం వంటిదని పేర్కొన్నారు. 35 వేలమంది ఉద్యోగులు, కార్మికులతోపాటు లక్షకుపైగా కుటుంబాలు పరిశ్రమపై ఆధారపడి జీవనోపాధిని కొనసాగిస్తున్నాయన్నారు. స్టీల్‌ప్లాంట్‌ కారణంగానే విశాఖపట్నం నగరం మహానగరంగా విస్తరించి రాష్ట్రంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన నగరంగా భాసిల్లుతోందని చెప్పారు. కరోనా మహమ్మారి సమయంలోనూ విశాఖ ఉక్కు పరిశ్రమ నుంచి దేశంలోని అనేక ప్రాంతాలకు లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ను రైళ్ల ద్వారా తరలించి లక్షలాదిమంది ప్రాణాలను నిలబెట్టిన విషయాన్ని గుర్తుచేశారు.

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌లో ఉత్పత్తి అయ్యే స్టీల్‌ నాణ్యతలో ప్రపంచస్థాయి సంస్థలకు పోటీ ఇస్తుందని, అలాంటి సంస్థ కేవలం సొంతంగా గనులు లేకపోయినందునే నష్టాలను చవిచూడాల్సి వస్తోందని చెప్పారు. కేవలం ఇనుప ఖనిజాన్ని మార్కెట్‌ రేటుకు కొనుగోలు చేయడం కోసమే విశాఖ ఉక్కు ఏటా రూ.300 కోట్లు అదనంగా భరించాల్సి వస్తోందన్నారు. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించి, అప్పులను ఈక్విటీ కింద మారిస్తే అతి తక్కువ కాలంలోనే  తిరిగి లాభాలబాట పడుతుందని, తద్వారా కేంద్ర ప్రభుత్వానికి భారీగా డివిడెండ్లు చెల్లిస్తుందని ఆయన పేర్కొన్నారు. కేంద్రమంత్రిని కలిసినవారిలో వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్‌రెడ్డి, పోరాట కమిటీ నేతలు సీపీఎం నాయకుడు సీహెచ్‌.నర్సింగరావు, స్టీల్‌ప్లాంట్‌ కార్మిక సంఘాల నాయకులు మంత్రి రాజశేఖర్, డి.ఆదినారాయణ, వరసాల శ్రీనివాసరావు, జి.గణపతిరెడ్డి, బోగాది సన్యాసిరావు, ఎం.అంబేద్కర్, పి.దేవేందర్‌రెడ్డి తదితరులున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వరంగ సంస్థగా కొనసాగించేలా చొరవ తీసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిలను బీజేపీ నాయకులు కోరారు. బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్‌ల సారథ్యంలో గాజువాక నాయకులు వారిని కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement