ఆ అన్నదమ్ములు రెండు భిన్న ధృవాలు. ఆర్థిక వ్యవహారాలతో పుట్టిన మనస్పర్థలు వాళ్ల మధ్య దూరం పెంచాయి. చివరకు తండ్రి ఏర్పాటు చేసిన వ్యాపార సామ్రాజ్యాన్ని పంచుకుని.. ఎవరి దారిని వాళ్లు ఎంచుకున్నారు. వ్యాపారం వాళ్ల రక్తంలోనే ఉంది.. రాణిస్తారేమో అని అంతా అనుక్నున్నారు. ఒకరేమో అందనంత ఎత్తుకు ఎదిగితే.. మరొకరు పతనం చవిచూశారు. కానీ, విడిపోయినా.. ఆ అన్నదమ్ముల అనుబంధం ఏమాత్రం తగ్గలేదు. అందుకే వాళ్ల ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతూ.. ట్రెండింగ్‌లోకి వచ్చేశాయ్.
2002లో వ్యాపార దిగ్గజం ధీరూభాయ్ అంబానీ మరణాంతరం అంబానీ సోదరుల మధ్య మనస్పర్థలు మొదలు అయ్యాయి. తల్లి కోకిలాబెన్ బిడ్డల మధ్య సయోధ్య కోసం ఎంతో ప్రయత్నించింది. చివరకు విడిపోయి.. వ్యాపారాలు పంచుకోవాలనే ఒప్పందానికి వచ్చారు అంబానీ బద్రర్స్. ఆయిల్, పెట్రోకెమికల్స్ వ్యాపారాలను అన్న ముఖేష్ అంబానీ ఎంచుకుంటే.. పవర్, టెలికామ్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను తమ్ముడు అనిల్ తీసుకున్నాడు.
అప్పటి నుంచి ఇద్దరిదీ ఎడమొహం పెడమొహం. కలుసుకున్న సందర్భాలు చాలా అరుదు. బోర్డు సమావేశాల్లో ప్లాస్టిక్ నవ్వులతో ఎదురుపడ్డా.. ఆప్యాయంగా పలకరించుకుందే లేదు. అయితే వ్యాపారంలో.. ముఖేష్ అంబానీ సంపద.. పెరుగుతూ పోతోంది. ఆసియాలోనే అపర కుబేరుడు అయ్యాడు ముఖేష్ అంబానీ. కానీ, అనిల్ అంబానీ సంపద మాత్రం దారుణంగా పడిపోయింది.
అయితే ఒక ఘటన.. ఆ అన్నదమ్ముల మధ్య దూరాన్ని చెరిపేసింది. ఇద్దరినీ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకునేలా చేసింది. 2019లో స్వీడిష్ టెలికాం కంపెనీ ఎరిక్‌సన్‌కు అనిల్ అంబానీ బకాయిలు పడ్డాడు. బకాయిలు క్లియర్ చేయకపోతే జైలు శిక్ష తప్పదని కోర్టు హెచ్చరించింది. ఆ కష్టకాలంలో తమ్ముడిని ఆదుకున్నాడు ముఖేష్ అంబానీ. కష్ట సమయాల్లో అండగా నిలిచినందుకు అన్నకు, వదినకు కృతజ్ఞతలు చెప్పాడు అనిల్ అంబానీ. అలాగని ఈ అన్నదమ్ముల అనుబంధం అక్కడితోనే ఆగిపోలేదు.
ముఖేష్ ఇంట జరిగే వేడుకలకు దాదాపు క్రమం తప్పకుండా హాజరవుతూ వస్తున్నాడు అనిల్. తాజాగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ–నీతా చిన్న కొడుకు అనంత్‌కు కాబోయే భార్య రాధికా మర్చంట్ భరతనాట్యం అరంగేట్ర కార్యక్రమం తాజాగా జరిగింది. జియో వరల్డ్ సెంటర్‌లోని గ్రాండ్ థియేటర్‌లో జరిగిన కార్యక్రమానికి అంబానీ, మర్చంట్ కుటుంబాలతో పాటు పలువురు ప్రముఖులు సైతం హాజరయ్యారు. అయితే ప్రత్యేక ఆకర్షణ నిలిచింది మాత్రం.. ఈ పెద్దోడు-చిన్నోడి అనుబంధమే!. అతిధులను ఆహ్వానిస్తూ.. ఇద్దరూ కలిసి భలే సందడి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment