అప్పులు, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న అనిల్ అంబానీ కొత్త ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) మార్కెట్‌లోకి ప్రవేశించడం ద్వారా సోదరుడు ముఖేష్ అంబానీకి సవాలు విసిరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ బీవైడీ మాజీ ఎగ్జిక్యూటివ్ సంజయ్ గోపాలకృష్ణన్‌ను రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కన్సల్టెంట్‌గా నియమించుకుంది. కంపెనీ ఎలక్ట్రిక్ కార్లు, బ్యాటరీల తయారీకి సంబంధించిన ప్రణాళికలను ఆయన మార్గనిర్దేశం చేయనున్నారు.
రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రస్తుతం ఏటా 2,50,000 వాహనాల ప్రారంభ ఉత్పత్తి సామర్థ్యంతో ఈవీ ప్లాంట్‌ను నిర్మించడానికి అయ్యే ఖర్చు సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని నిర్వహిస్తోంది. రానున్న రోజుల్లో దీనిని ఏటా 7,50,000 వాహనాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ కార్లతో పాటు బ్యాటరీ తయారీ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేసే అంశాన్ని రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరిశీలిస్తోంది. 10 గిగావాట్ హవర్స్ (GWh) సామర్థ్యంతో ప్రారంభించి, వచ్చే దశాబ్దంలో 75 గిగావాట్ హవర్స్‌కి విస్తరించాలనేది కంపెనీ ప్రణాళిక అని మూలాలను ఉటంకిస్తూ రాయిటర్స్ పేర్కొంది.
దీనిపై కంపెనీ అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ ఈ వార్తలు ఇప్పటికే ప్రభావం చూపాయి. రాయిటర్స్ కథనం తర్వాత, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్లు దాదాపు 2% పెరిగాయి. ఈ ప్రాజెక్ట్ విజయవంతమై ముందుకు సాగితే, ఇప్పటికే ఈవీ మార్కెట్‌లో పురోగతి సాధిస్తున్న ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి ప్రత్యక్ష పోటీని ఇవ్వవచ్చని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment