దేశంలో ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళా జరుగుతుంటుంది. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లోగల గంగా, యమున, సరస్వతుల సంగమాన ఈ మహోత్తర కార్యక్రమం జరగనుంది. జనవరి 13 నుండి జరిగే కుంభమేళాకు పెద్ద ఎత్తున భక్తజనం తరలిరానున్నారు. కుంభమేళాకు హాజరయ్యేవారు సమీపంలోని కొన్ని ప్రాంతాలను తప్పనిసరిగా దర్శిస్తుంటారు. ఆ వివరాలు..
త్రివేణీ సంగమం
మహా కుంభమేళాలో స్నానానికి అత్యంత ప్రత్యేకమైన ప్రదేశం త్రివేణి సంగమం. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే ప్రదేశం ఇది. ఇక్కడే కుంభ స్నానం ఆచరిస్తారు.
నాగ్ వాసుకి ఆలయం
ప్రయాగ్‌రాజ్‌లోని నాగ్ వాసుకి దేవాలయాన్ని ఇటీవలే పునరుద్ధరించారు. ఈ ఆలయ శిల్పకళ ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. ప్రయాగ్‌రాజ్‌కు వచ్చేవారు ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శిస్తుంటారు.
శయన హనుమంతుడు
ప్రయాగ్‌రాజ్‌లోని దర్గంజ్ ప్రాంతంలో గంగా నది ఒడ్డున ఉన్న హనుమంతుని ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. దీనిని సంకట్ మోచన హనుమాన్ దేవాలయం అని అంటారు. సమర్థ గురు రాందాస్ ఇక్కడ హనుమంతుని శయన విగ్రహాన్ని ప్రతిష్టించారని చెబుతారు. ఈ ఆలయంలో ఇతర దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి.
ఆలోప్ శంకరి ఆలయం
ప్రయాగ్‌రాజ్‌లోని అలోపి బాగ్‌లోని అలోప్ శాంకరీ ఆలయం ఎంతో పురాతనమైనది. ఈ ఆలయం సంగమ తీరానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడకు నిత్యం భక్తులు తరలివస్తుంటారు.
వేణుమాధవ దేవాలయం
ప్రయాగ్‌రాజ్‌లోని నిరాలా రోడ్‌లో ఉన్న ఈ ఆలయంలో విష్ణువు ధరించిన పన్నెండు రూపాల విగ్రహాలు ఉన్నాయి. శాలిగ్రామ శిలతో చేసిన విష్ణుమూర్తి విగ్రహం ఎంతో సుందరంగా కనిపిస్తుంది. కుంభమేళాకు వచ్చేవారు ఈ ఆలయాన్ని తప్పనిసరిగా దర్శిస్తుంటారు.
ప్రయాగ్‌రాజ్ మ్యూజియం
ప్రయాగ్‌రాజ్ మ్యూజియం ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రయాగరాజ్ సాంస్కృతిక వారసత్వాన్ని ఇక్కడ భద్రపరిచారు. ఇక్కడ గంగా గ్యాలరీని దర్శించి, పలు శాస్త్రీయ అంశాలు తెలుసుకోవచ్చు.
శంకర విమాన మండపం
ప్రయాగ్‌రాజ్‌లో 130 అడుగుల ఎత్తైన శంకర విమాన మండప ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని దక్షిణ భారత శైలిలో నిర్మించారు. ఈ ఆలయంలో ఆదిశంకరాచార్య, కామాక్షి దేవి, తిరుపతి బాలాజీ తదితర విగ్రహాలు ప్రతిష్ఠితమయ్యాయి.
ఆనంద్ భవన్
ప్రయాగ్‌రాజ్‌లోని ఆనంద్ భవన్‌కు ఎంతో చరిత్ర ఉంది. ఇది దేశ మొదటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అధికారిక నివాసం. దీన్ని మ్యూజియంగా మార్చి దేశ స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన ఆనవాళ్లను ఇక్కడ ఉంచారు.
విక్టోరియా మెమోరియల్
ప్రయాగ్‌రాజ్‌లో ఇటాలియన్ పాలరాయితో నిర్మించిన విక్టోరియా మెమోరియల్ ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. నాడు ఒక గొడుగు కింద క్వీన్ విక్టోరియా విగ్రహం నెలకొల్పారు. తరువాత విగ్రహం తొలగించినప్పటికీ, గొడుగు అలానే కనిపిస్తుంటుంది.
తేలియాడే రెస్టారెంట్
గంగా నదిలో తేలియాడే రెస్టారెంట్ పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది. గంగానదిలో పడవ ప్రయాణం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ పడవలో కూర్చొని భోజనం చేయవచ్చు? అలాగే గంగా ఒడ్డున జరిగే కార్యక్రమాలను కూడా చూడవచ్చు.
ఇది కూడా చదవండి: Sanjay Gandhi Birthday: ఇందిరకు నచ్చని మేనక?.. అయినా సంజయ్‌తో పెళ్లెలా జరిగింది?
Comments
Please login to add a commentAdd a comment