![Washim Youth Writes Letter to Maharashtra CM for Marriage - Sakshi](/styles/webp/s3/article_images/2021/01/15/6_1.jpg.webp?itok=kpOezn9W)
సాక్షి, ముంబై: నాకు ఉద్యోగమైనా ఇవ్వండి లేదంటే పిల్లను చూసి పెళ్లైనా చేయండంటూ... మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఓ యువకుడు రాసిన లేఖ సోషల్ మీడియాల్ హల్‌చల్ చేస్తోంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో అనేక మంది ఉపాధి కోల్పోవడంతోపాటు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. ఇలాంటి నేపథ్యంలో అనేక మంది అనేక రకాలుగా ప్రభుత్వాన్ని మద్దతు కోరుతూ లేఖలు రాస్తున్నారు. ఇలాంటి లేఖలలో వాషీం జిల్లాకు చెందిన గజానన్ రాథోడ్ అనే యువకుడు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు ఓ లేఖ రాశాడు.
ఆ లేఖలో ముఖ్యంగా ‘నా వయసు 35 ఏళ్లు. ఇంత వరకు నాకు పెళ్లి కాలేదు. దీనికి కారణం నాకు ఇంకా ఉద్యోగం లభించకపోవడమే. ఇప్పటి వరకు నేను ఏడు సార్లు ఉద్యోగం కోసం ప్రిపేరై పరీక్షలు రాశాను, కాని చాలా తక్కువ మార్కులతో ఉద్యోగం దక్కలేదు. అయితే పెళ్లి కోసం పిల్లను చూసేందుకు వెళ్లినప్పుడు ఉద్యోగం ఉండాలన్న షరతు విధిస్తున్నారు. ఇలాంటి సమయంలో మీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇంకా ఎలాంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు విడుదల చేయడంలేదు. దీంతో ఉద్యోగంతోపాటు పెళ్లి కోసం పిల్ల లభించడం కూడా కష్టసాధ్యమైంది. ఇలాంటి సమయంలో నాకు అయితే జాబ్ ఇవ్వండి లేదంటే పిల్లను చూసి పెళ్లయినా చేయండం’టూ రాశాడు.
గజానన్ రాథోడ్ రాసిన ఈ లేఖ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. గతంలో కూడా ఇలాంటి అనేక లేఖలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ముఖ్యంగా బీడ్ జిల్లాలోని ఓ యువకుడు తనను ఒక రోజు ముఖ్యమంత్రిని చేయాలని కోరుతూ.. మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోషియారికి లేఖ రాశాడు. తనను ముఖ్యమంత్రిని చేస్తే మరాఠ్వాడాలోని సమస్యలన్నింటినీ పరిష్కస్తానని చెప్పుకొచ్చాడు. అదేవిధంగా ఆ యువకుడు తన స్వగ్రామం నుంచి ముంబైలో కోర్కెలు తీర్చేదైవంగా ప్రసిద్ధిగాంచిన లాల్‌భాగ్ రాజా వినాయకుని ఆలయం వరకు కాలినడకన వెళ్లి, పూజలు చేశాడు. ఇలా ఆ సమయంలో అతని చర్య రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయింది.
చదవండి:
శిష్యురాలికి ట్రైనింగ్.. ఆ వ్యక్తి చనిపోయాడని..
Comments
Please login to add a commentAdd a comment