కోల్‌కతా: ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న విమానం తీవ్ర కుదుపులకు లోనుకావడంపై నివేదిక ఇవ్వాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)ను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోరింది. సమాజ్‌వాదీ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వారణాసి వెళ్లిన సీఎం మమత శుక్రవారం సాయంత్రం చార్టర్డ్ విమానంలో తిరిగి వస్తున్నారు. ఒక్కసారిగా బలమైన ఈదురుగాలులు వీయడంతో ఆ విమానం తీవ్ర కుదుపులకు లోనయింది. దీంతో పైలట్ అప్రమత్తమై సుభా‹ష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
అకస్మాత్తుగా విమానం పైకి, కిందికి ఊగిసలాడటంతో మమతా బెనర్జీ వెన్నెముకకు గాయమైంది. ఈ ఘటనను బెంగాల్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న విమానం ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకోవడానికి గల కారణాలపై నివేదిక ఇవ్వాలని డీజీసీఏను కోరింది. ఈ మేరకు రిపోర్టు సిద్ధం చేస్తున్నట్లు డీజీసీఏ అధికారి ఒకరు వెల్లడించారు. సీఎం మమత భద్రతపై అధికార టీఎంసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆమె ప్రయాణిస్తున్న విమానాలు గతంలోనూ ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నాయని, దర్యాప్తు చేపట్టాలంది.
Comments
Please login to add a commentAdd a comment