
అగర్తలా: ఓ పెళ్లి మంటపానికి వెళ్లి వీరంగం సృష్టించారనే ఆరోపణలు ఎదుర‍్కొంటున్న త‍్రిపుర పశ్చిమ జిల్లా కలెక్టర్ శైలేష్ కుమార్ తనను విధుల నుంచి వైదొలగించాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఈ విషయాన్ని న్యాయశాఖ మంత్రి రతన్‌లాల్ నాథ్ మీడియాకు వెల్లడించారు. తనపై వచ్చిన ఆరోపణలపై దర‍్యాప్తు నిష్పక్షపాతంగాగా జరగాలంటే తనను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించాలని కలెక్టర్ శైలేష్ కుమార్ సీఎస్‌కు రాసిన లేఖలో పేర్కొన్నట్లు రతన్‌లాల్ తెలిపారు.
త్రిపుర పశ్చిమ జిల్లా కలెక్టర్ శైలేష్‌కుమార్ యాదవ్ ఏప్రిల్ 26న అగర్తాలాలో ఓ వివాహం జరగాల్సి ఉండగా.. అక్కడకు వెళ్లి వీరంగం సృష్టించారు. వరుడు, వధువు, అతిథులతో పాటు, అక్కడే ఉన్న పురోహితులపై చేయిచేసుకున్నారు. కనిపించిన వారిపై చిర్రుబుర్రులాడారు. కలెక్టర్ చిందులు తొక్కుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
దీనిపై బ్రాహ్మణ సమాజ్ సంఘం నేతలు, వివిధ సామాజిక సంస్థలు, మానవ హక్కుల నేతలు, ప్రముఖ సింగర్ సోను నిగంలు సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. శైలేష్ కుమార్ యాదవ్‌ను సస్పెండ్ చేయాలని సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు. దీంతో త్రిపుర సీఎం విప్లవ్ కుమార్ దేవ్ ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. విచారణకు హాజరు కావాలని కలెక్టర్‌ను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో విచారణకు హాజరైన శైలేష్ కుమార్ మాట్లాడుతూ.. 'కరోనా నిబంధనల‍్ని ఉల్లంఘించినందుకే చర్యలు తీసుకున్నా. చట్టాన్ని అమలు చేయడం నా కర్తవ్యం. నేను ఏదైనా తప్పు చేస్తే క్షమించండి’’ అంటూ యూటర్న్ తీసుకున్నారు. కాగా, ప్రస్తుతం త్రిపుర పశ్చిమ జిల్లా కలెక్టర్ గా ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డైరెక్టర్ రావెల్ హమేంద్ర కుమార్ డీఎమ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment