కోల్‌కతా: వెస్ట్‌బెంగాల్ గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారంలో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ ఆరోపణలపై విచారణ కోసం తమ ముందు హాజరు కావాలని నలుగురు రాజ్‌భవన్ ఉద్యోగులకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సెట్)సమన్లు జారీ చేసింది.
ఇంతేకాకుండా రాజ్‌భవన్‌లోని సీసీటీవీ వీడియోలను తమకు ఇవ్వాలని సెట్ అక్కడి అధికారులను కోరింది. ‘గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశాం. ఈ బృందం రానున్న రోజుల్లో కొందరు సాక్షులను విచారించనుంది.
లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి కొన్ని వీడియోలు కావాలని రాజ్‌భవన్‌ను ఇప్పటికే కోరాం’అని ఒక పోలీసు అధికారి చెప్పారు. కాగా, రాజ్‌భవన్‌లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే ఒక మహిళా ఉద్యోగి గవర్నర్‌పై రాతపూర్వక ఫిర్యాదు చేసింది. తనను గవర్నర్ సివి ఆనంద్‌బోస్ లైంగిక వేధింపులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొంది.
అయితే గవర్నర్‌కు రాజ్యాంగపరమైన రక్షణ ఉండటం వల్ల పోలీసులు, కోర్టులు క్రిమినల్ చర్యలు ప్రారంభించడానికి వీలు లేదు. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని గవర్నర్ స్పష్టం చేశారు. రాజ్‌భవన్‌లోకి పోలీసులను రానివ్వద్దని సిబ్బందికి ఇప్పటికే ఆయన ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment