దీపావళి పండుగ అంటే పిల్లలకు ఎంతో ఇష్టం. ఇల్లంతా దీపాలతో అలంకరిస్తూ పిల్లలు ఎంతో హడావుడి చేస్తుంటారు. దీపావళి వేళ ఎటుచూసినా దీపాల వెలుగులు కనిపిస్తాయి. దీపావళి నాడు చిన్న పిల్లల చేత పెద్దలు దివిటీలు కొట్టిస్తారు. దీనివెనుక ఒక పరమార్థం ఉంది.
దీపావళి రోజున పిల్లల చేత దివిటీలు కొట్టించడం ఒక సంప్రదాయంగా వస్తోంది. ఈ దివిటీలను ప్రత్యేకంగా తయారు చేస్తారు. గోగు కర్రలకు నూనెలో నానబెట్టిన ఒత్తిని కట్టి, దానిని దీపంతో వెలిగిస్తారు. పిల్లలకు ఆ కర్రలను ఇచ్చి, పెద్దలు తమ సమక్షంలో ఆ దివిటీలను కొట్టిస్తారు. ఈ సమయంలో వాటిని గాలిలో గుండ్రంగా మూడుసార్లు తిప్పుతారు. ‘దిబ్బు దిబ్బు దీపావళి మళ్లీ వచ్చే నాగుల చవితి’ అని పిల్లల చేత పాలు పాడిస్తూ ఈ వేడుక చేస్తారు.
ఈ దివిటీలు కొట్టించే కార్యక్రమం ముగిశాక పిల్లల కాళ్లు చేతులు కడిగి స్వీట్స్ తినిపిస్తారు. అనంతరం పిల్లల చేత టపాసులు కాల్పిస్తారు. ఈ దివిటీలు కొట్టించడం వెనుకనున్న అంతరార్థం విషయానికొస్తే.. దీపావళి రోజున పితృదేవతలు సంధ్యా సమయంలో ఆకాశంలో దక్షిణ దిక్కుగా వచ్చి తమ గృహాలను చూస్తారట. వారికి ఆహ్వనం పలుకుతున్న రీతిలో దివిటీలను కాలుస్తారని పండితులు చెబుతారు. ఇది పూర్వకాలం నుంచి ఏర్పడిన సంప్రదాయం అని పెద్దలు చెబుతుంటారు.
ఇది కూడా చదవండి: సువాసనలు వెదజల్లే దీపాలను వెలిగిద్దాం ఇలా..!
Comments
Please login to add a commentAdd a comment