కోల్‌కత్తా : కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని పశ్చిమ బెంగాల్‌లో అమలు చేయకపోవడంపై ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంఖర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయకుండా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వైద్య అధికారులపై ఒత్తిడి చేశారని విమర్శించారు. కోవిడ్ నియంత్రకు దేశీయంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ మూడోదశ ప్రయోగాన్ని బుధవారం ఐసీఎంఆర్ వద్ద గవర్నర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తృణమూల్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ అమలులో ఉన్న రాష్ట్రాల్లో వైద్య పరంగా వృద్ధిని సాధించామని, దురదృష్టవశాత్తు బెంగాల్ దీనిలో భాగస్వామ్యం కాలేకపోయిందని అన్నారు.
వైద్య పరికరాల కొనుగోలులో అవకతవకలు జరిగాయని, ఆరోగ్యమంత్రిత్వ శాఖలో చోటుచేసుకున్న అవినీతిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. రూ. 2,000 కోట్ల విలువైన నిధులు దారిమళ్లాయని ఆరోపించారు. గవర్నర్ వ్యాఖ్యలను మంత్రి ఫిర్హాద్ హకీమ్ తీవ్రంగా ఖండించారు. గవర్నర్ హోదాలో ఉండి రాజకీయాలు చేయడం సరికాదన్నారు. అవకతవకలపై దర్యాప్తు కోసం ఆగస్టులో ముఖ్యమంత్రి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. 2019 జూలైలో బెంగాల్ గవర్నర్‌గా జగదీప్ ధంఖర్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తృణముల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment