రామసేతు నిర్మాణంలో ఉపయోగించిన రాళ్ల విషయంలోనూ చాలా వాదనలున్నాయి. అసలవి నిజమైన రాళ్లేనా లేక వృక్షాలను ఒక క్రమ పద్ధతిలో రాళ్లుగా చేసి వంతెన నిర్మాణంలో ఉపయోగించారా అనే అనుమాలున్నాయి. ఈ సందేహాలకు సరైన కారణాలే ఉన్నాయి. వారధి నిర్మాణానికి చెందినవిగా పేర్కొంటున్న రాళ్లు కొన్ని ఇప్పటికీ రామేశ్వరంలో ఉన్నాయి. ఐతే అవి నీటిలో తేలుతూ ఉండడం గమనార్హం. అంటే రామవారధి నిర్మాణంలో నీటిపై తేలియాడే రాళ్లను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే నీటిపై తేలియాడే రాళ్లను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.? ఆ రాళ్లు ఎలాంటి పదార్థంతో తయారయ్యాయి. ?
వంతెన నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లు ఏ రకం పదార్థానికి చెందినవనే అంశంపై కూడా పరిశోధనలు జరిగాయి. ఓ వాదన ప్రకారం ఆ రాళ్లు అగ్నిశిలకు చెందిన రాళ్లు. అగ్నిపర్వతం పేలిన తర్వాత వెలువడే లావాకు ఘనరూపమే ఈ అగ్నిశిల రాళ్లు. ఇవి నీటిపై తేలియాడే స్వభావాన్ని కలిగి ఉంటాయట. ఐతే తమిళనాడు, శ్రీలంక పరిసరాల్లో ఎక్కడా కూడా మనకు అగ్నిపర్వతాలు కనిపించవు. దాంతో రామ సేతు నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లు ప్యూమిక్ స్టోన్స్‌అనే వాదన తప్పు అని తేలి పోయింది. మరో వాదన ఏంటంటే వారధికి చెందిన రాళ్లు పగడపు దిబ్బలకు చెందినవి. ఐతే ఈ వాదనలో కూడా పస లేదని బయటపడింది. ఎందుకంటే పగడపు దిబ్బల్లో కాల్షియం కార్బో నేట్ పదార్థముంటుంది.దీని సాంద్రత నీటి సాంద్రత కంటే ఎక్కువ.కాబట్టి నీటిపై తేలడం కష్టం.
మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు కూడా రామసేతు మానవ నిర్మితం కాదని వాదించింది. అది సహజంగా ఏర్పడిన కట్టడమే అని పేర్కొంది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ కూడా సమర్పించారు. అంతేగాక సేతుసముద్రం షిప్పింగ్ కెనాల్ పేరుతో ఓ భారీ ప్రాజెక్టు నిర్మాణానికి కూడా యూపీఏ సర్కారు పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టుతో రామ సేతు ఉనికే లేకుండా పోతుందన్న ఆందోళనలు ఉన్నాయి. అయితే యూపీఏ సర్కారు వాటిని పట్టించుకోలేదు. కానీ బీజేపీ, అన్నాడీఎంకే తదితర పార్టీలు ఆందోళనలు చేపట్టడంతో యూపీఏ సర్కారు వెనక్కి తగ్గింది.
ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే రామసేతు రామాయణం కాలం నాటిది. అంటే త్రేతాయుగానికి చెందినదన్నమాట.యుగాల లెక్కల ప్రకారం సత్య యుగం వయసు 17 లక్షల 28 వేల సంవత్సరాలు. త్రేతాయుగ కాల పరిమాణం 12 లక్షల 96 వేల ఏళ్లు. ద్వాపర యుగం వయసు 8 లక్షల 64 వేల ఏళ్లు. కలియుగం వయసు 4 లక్షల 32 వేల ఏళ్లు. ఇక కలియుగం క్రీస్తు పూర్వం 3102లో ప్రారంభమైనట్లు చెబుతారు. ఈ లెక్కన కలియుగం నుంచి త్రేతాయుగానికి మధ్య కొన్ని లక్షల సంవత్సారాలు ఉన్నాయి. ఐతే విదేశీ సైంటిస్టులు మాత్రం రామసేతు నిర్మాణంలోని రాళ్లు 7 వేల ఏళ్ల క్రితం నాటివిగా చెబుతుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment