సిసోడియాకు బెయిల్‌.. కేజ్రీవాల్‌ కేసుకు కూడా ప్రయోజనం: లాయర్‌ | Will Benefit Arvind Kejriwal Case Too: Manish Sisodia Lawyer On Bail Order | Sakshi
Sakshi News home page

సిసోడియాకు బెయిల్‌.. కేజ్రీవాల్‌ కేసుకు కూడా ప్రయోజనం: లాయర్‌

Published Fri, Aug 9 2024 2:27 PM | Last Updated on Fri, Aug 9 2024 3:55 PM

Will Benefit Arvind Kejriwal Case Too: Manish Sisodia Lawyer On Bail Order

న్యూఢిల్లీ: ఆప్‌ సీనియర్‌ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాకు బెయిల్‌ లభించిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్‌ కేసులో సుప్రీంకోర్టు సిసోడియాకు శుక్రవారం బెయిల్‌ మంజూరు మంజూరు చేసింది. దీంతో సిసిఓడియా రేపు తిహార్‌ జైలు నుంచి విడుదల కానున్నారు.

ఈ సందర్భంగా సిసోడియా తరపున కోర్టులో వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ మీడియాతో మాట్లాడుతూ. విధివిధానాలు పూర్తయిన తర్వాత సిసోడియా శనివారం తిహార్‌ జైలు నుండి విడుదల కానున్నారని తెలిపారు. ఈ తీర్పు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కేసుకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు.

అయితే లిక్కర్‌ పాలసీకి సంబంధించిన ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్‌ ఇచ్చినప్పటికీ సీబీఐ కేసులో బెయిల్‌ రాకపోవడంతో ఆయన ఇంకా జైలులోనే ఉన్నారు.  సీబీఐ కేసులో జ్యుడీషియల్‌ కస్టడీని  ఆగష్టు 20వరకు కోర్టు పొడిగించింది. 

కాగా లిక్కర్‌ పాలసీకి సంబంధించిన సీబీఐ కేసులో గతేడాది ఫిబ్రవరి 26న అరెస్టు అయ్యారు. ఆ తరువాత రెండు వారాలకే ఈడీ కేసులో అదుపులోకి తీసుకున్నారు. 18 నెలలుగా జైల్లోనే ఉన్నారు. ఈ క్రమంలో బెయిల్‌ కోరుతూ ఆ మధ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్‌ బి.ఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కె.వి. విశ్వనాథన్‌ ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.

రూ.10లక్షల వ్యక్తిగత పూచీకత్తు, ఆ మొత్తానికి ఇద్దరు షూరిటీలతో ఆయనను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా కొన్ని షరతులు విధించింది. సిసోడియా తన పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది.

ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఏ నిందితుడిని కాలపరిమితి లేకుండా జైలులో ఉంచలేరు. కేసు విచారణలో పురోగతి లేకపోయినా.. సుదీర్ఘకాలం ఆ వ్యక్తిని జైల్లో ఉంచడం సరికాదు. అది ఆ వ్యప్రాథమిక హక్కులను కాలరాయడమే అవుతుంది. బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవడం, ఉపశమనం పొందడం వారి హక్కు. ‘బెయిల్‌ అనేది నియమం.. జైలు మినహాయింపు’ అనే విషయాన్ని ట్రయల్‌ కోర్టులు, హైకోర్టులు గ్రహించాల్సిన సమయం ఆసన్నమైంది’. అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ప్రస్తుతం జైలు నంబర్ 1లో ఉన్న ఆయన.. ఖైదీలను విడుదల చేయడానికి సాధారణంగా ఉపయోగించే గేట్ నంబర్ 3 ద్వారా బయటకు అవకాశం ఉందని తీహార్ జైలు వర్గాలు సూచించాయి. అయితే, భద్రతాపరమైన సమస్యలు ఏవైనా ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయవచ్చు. సిసోడియా విడుదలకు సమయం బెయిల్ ఆర్డర్ ప్రాసెసింగ్‌పై ఆధారపడి ఉండనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement