
సమస్తీపూర్: తాను బతికి ఉన్నంతకాలం బీజేపీతో మళ్లీ కలిసే ప్రసక్తే లేదని బిహార్ ముఖ్యమంత్రి,, జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి దర్యాప్తు సంస్థలను వాడుకుంటోందని బీజేపీపై మండిపడ్డారు. ఆయన శుక్రవారం సమస్తీపూర్‌లో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను ప్రారంభించి.. ప్రసంగించారు.
వారు గతంలో లాలూ గారిపై(ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్) కేసు పెట్టారు. దాని వల్ల ఆయనతో నాకు సంబంధాలు తెగిపోయాయి. వాళ్లకు ఒరిగింది ఏమీ లేదు. ఇప్పుడు మేము మళ్ళీ కలిసి ఉన్నప్పుడు, వాళ్లు మళ్లీ కేసులు పెడుతున్నారు. ఇలాంటి వాళ్ల పనితీరు శైలి ఎలా ఉందో మీరు గమనించవచ్చు అంటూ పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన.
అయితే.. ప్రస్తుత బీజేపీ నాయకత్వం అరాచకంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌జోషీ హయాం నాటి బీజేపీ ఇప్పుడే లేదన్నారు. అందుకే తాను తుదిశ్వాస విడిచేవరకు జేడీయూ.. బీజేపీతో కలవబోదని అన్నారాయన. జేడీ(యూ), కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలకు కూడిన ‘మహాఘట్‌బంధన్’ ఎప్పటికీ కలిసే ఉంటుందని తేల్చిచెప్పారు. దేశ ప్రగతి కోసం తామంతా కలిసి పని చేస్తామని అన్నారు.
ఇదీ చదవండి: మోయలేని భారం మోపే వాడే మోదీ
Comments
Please login to add a commentAdd a comment